సైకిళ్ల వినియోగంపై ప్రచారం అవసరం
– మెట్రో రైలు లాంటివి అవసరం
– తెలంగాణ మెట్రో ప్రాజెక్ట్ ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ కానుంది
– ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్,నవంబర్4(జనంసాక్షి) : సైకిళ్ల వినియోగంపై ప్రచారం అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హెచ్‌ఐసీసీలో పట్టణ రవాణ వ్యవస్థపై మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటంలో సైకిళ్ల పాత్ర ముఖ్యమైందని తెలిపారు. దేశంలో మధుమేహం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ నడక, సైక్లింగ్ చేయ్యాలని వెంకయ్య పేర్కొన్నారు. మెట్రో రవాణ వ్యవస్థ ఖరీదుతో కూడుకున్నదన్నారు. నగర కాలుష్య నివారణకు ఎలక్టిక్ర్ బస్సులను వినియోగంలోకి తేవాలన్నారు. మెట్రో నగరాల్లో పార్కింగ్ సమస్య పెరుగుతోందని చెప్పారు. ఢిల్లీలో కోటి వాహనాలు ఉన్నాయన్నారు. ఎక్కువ వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. పెరుగుతున్న వాయు కాలుష్యానికి అనుగుణంగా రవాణా వ్యవస్థను పెంచాల్సిన అవసరం ఉందని వెంకయ్య అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ నగరంలో మెట్రోరైలుతో కాలుష్యం కొంతమేర అరికట్టవచ్చునని పేర్కొన్న ఆయన తెలంగాణ మెట్రో ప్రాజెక్ట్ ప్రపంచంలో పెద్ద ప్రాజక్ట్ కానుందన్నారు.
28న మెట్రో తొలిదశ ప్రారంభం…
ఈ నెల 28న మెట్రో తొలిదశను ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. పట్టణ రవాణా వ్యవస్థపై హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ నెల 28న నాగోలు-మియాపూర్ మధ్య మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. మెట్రోవ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 10 మిలియన్ల జనాభా ఉందన్నారు. 17వ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లో జరగడం సంతోషంగా ఉందన్నారు. సదస్సులో కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్ పూరి, వివిధ దేశాల నుంచి వచ్చిన 1000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.



