సైకో సాంబగా మారుతా!

అధికారుల తీరుపై ఎమ్మెల్యే రాజేష్‌ సంచలన వార్తలు
ఏలూరు, జూలై 31 : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే రాజేశ్‌కుమార్‌కు అధికారుల తీరుపై చిరెత్తుకొచ్చింది. జిల్లా కలెక్టర్‌ వాణిమోహన్‌ అధ్యక్షతన మంగళవారం ఏలూరులో జరిగిన విజిలెన్స్‌ సమీక్ష కమిటీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖమంత్రి పితాని సత్యనారాయణ, ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు, ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, సుధాకర్‌, జిల్లా అధికారుల సమక్షంలోనే తమ మనసులోని ఆగ్రహాన్ని బయటపెట్టారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే తాను కూడా కత్తిపట్టుకొని సైకో సాంబలా మారాల్సి ఉంటుందని, అప్పుడైనా అధికారులు కష్టపడి పని చేస్తారని వ్యాఖ్యానించారు. దాంతో సమావేశంలో మంత్రితో సహా అందరూ పెద్దపెట్టున నవ్వారు. చింతలపూడి నియోజకవర్గంలో ప్రజల దాహార్తి నివారణకు సత్యసాయి సేవా సమితి ఏర్పాటు చేసిన మంచినీటి పథకం కింద ఇంతవరకు చుక్కనీరు ఇవ్వకపోవడం ఎమ్మెల్యే రాజేశ్‌కు కోపం తెప్పించింది. పైగా 15 రోజుల క్రితం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన డిఆర్‌టి సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే మంత్రి సానుకూలంగా స్పందించినా ఇంతవరకు ఫలితం దక్కలేదని, అదేమని అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా బదులు ఇస్తున్నారనేది ఆయన బాధకు కారణమై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.