స్వీడిష్‌ కంపెనీకి దళారీగా రాజీవ్‌

బాంబు పేల్చిన వికీలీక్స్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ కేంద్రంగా మరోసారి దేశరాజకీయాల్లో దుమారం రేగే పరిస్థితి కనబడుతోంది. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించకముందు పైలెట్‌గా పనిచేస్తున్న సమయంలో ఒక స్వీడిష్‌ కంపెనీ జెట్‌ విమానాల అమ్మకాలకు సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించి ఉండొచ్చంటూ అమెరికా దౌత్య కేబుల్స్‌ను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల పత్రిక సోమవారం ప్రచురించిన కథనం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. వికీలీక్స్‌ బయటపెట్టిన ఈ కేబుల్స్‌ వివరాలు తమకందుబాటులోకి వచ్చాయని వాటిని వికీలీక్స్‌ నేడు వెల్లడించే అవకాశం ఉందని కూడా ఆ పత్రిక పేర్కొంది. వివరాలు ఇలా ఉన్నాయి.  భారతదేశంలో స్వీడిష్‌ కంపెనీ సాబ్‌- స్కానియా తన విగ్గెన్‌ పైటర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను విక్రయించాలని తలపెట్టినప్పుడు రాజీవ్‌ గాంధీ మధ్యవర్తిగా వ్యవహరించి ఉంటారని వికీలీక్స్‌ తెలియజేసింది.

రాజీవ్‌ గాంధీ ప్రధాని కావడానికి చాలా ఏళ్ళ ముందు 1970లో ఆ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. అప్పుడు రాజీవ్‌ గాంధీ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌గా పనిచేస్తున్నారు. కిసింజర్‌ కాలానికి చెందిన ఆ రహస్యాల వెల్లడి దుమారం రేపే అవకాశం ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడైన రాజీవ్‌ గాంధీ స్వీడిష్‌ కంపెనీ తరఫున సంప్రదింపులు జరిపాడా, లేదా అనేది ఎవరూ తేల్చడం లేదు. ఈ సమాచారాన్ని ధ్రువీకరించడానికి గానీ, తిరస్కరించడానికి అమెరికా అధికారుల వద్ద అదనపు సమాచారం లేదని వికీలీక్స్‌ కేబుల్‌ వ్యాఖ్యానించింది. రాజీవ్‌ గాంధీని ఎంటర్‌ప్రెన్యూర్‌గా అభివర్ణించింది. రాజీవ్‌ గాంధీ పాత్ర ఉన్నట్లు చెబుతున్న వికీలీక్స్‌ వెల్లడిపై బిజెపి అధికార కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వార్త కాంగ్రెస్‌ ప్రత్యర్థులకు ఆయుధంగా ఉపయోగపడే అవకాశముంది. అయితే కాంగ్రెస్‌ వర్గాలు ఇప్పటివరకు ఈ వార్తపై పెదవి విప్పలేదు.

తాజావార్తలు