హరీష్‌ రావా మాకు పాఠాలునేర్పేది

అసెంబ్లీని కౌరవసభగా మార్చారు

కాంగ్రెస్‌ మాజీ ఎంపి పొన్నం తదితరుల మండిపాటు

హైదరాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): అసెంబ్లీని కౌరవ సభగా మార్చారని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. సభ నిర్వహణపై తమకు మంత్రి హరీష్‌ రావు పాఠాలు నేర్పుతున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గతంలో బల్లలు ఎక్కినప్పుడు, మైకులు విరిచినప్పుడు హరీష్‌రావుకు సంప్రదాయాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. అలాగే రైతులు కష్టాల్లో ఉంటే మేం చూస్తూ ఎలా ఊరుకుంటామని, ఆదివారం పత్తి రైతుల వద్దకు వెళదాం… హరీష్‌రావు వస్తారా? అని పొన్నం అన్నారు. నిరసనలను అణచివేసి ప్రభుత్వమే సెల్ఫ్‌ గోల్‌ కొట్టుకుందని, కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ ఏం చేస్తోందో అర్ధంగాకుండా ఉందని ఆయన అన్నారు. తెరాస ప్రభుత్వం వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని తామెన్నో సార్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశామని, కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం అంటూ ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారని ఆక్షేపించారు. రైతు సమస్యలు పరిష్కరిస్తే ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ఇద్దరికీ గౌరవంగా ఉంటుందని సూచించారు. గంటలకు గిట్టుబాటు ధర లేక ప్రతి మార్కెట్‌లోనూ రైతులు ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ త్యాగాల వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పి.. మాట మార్చి నాలుగు విడతల్లో చేశారని విమర్శించారు. ఒకే విడతలో చేయని పక్షంలో కనీసం వడ్డీ చెల్లించాలని తాము విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే ఎకరానికి రూ.4వేలు అనే కొత్త మోసానికి తెరలేపారని ఆరోపించారు. అసెంబ్లీ లోపల, బయట తెరాస వ్యవహార శైలి దారుణంగా ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు. విపక్ష నేతకు మండలిలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. రైతుల సమస్యలు లేవనెత్తకుండా ప్రతిపక్షాల నోళ్లు మూసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల ముందు నుంచే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.మాజీ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఆందోళనతో అధికార టిఆర్‌ఎస్‌ తట్టుకోలేకపోయిందన్నారు. కావాలనే కాంగ్రెస్‌ ర్యాలీని అడ్డుకున్నారని అన్నారు. అయితే ప్రజలకు ప్రభుత్వ తీరు అర్థం అయిపోయిందన్నారు. హరీష్‌ బెదరింపులకు కాంగ్రెస్‌ బెదరదని అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దిమ్మ తిరిగిందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పేర్కొన్నారు. పత్తి, మొక్కజొన్న కొనుగోలుకు మంత్రి హరీశ్‌ ఆదేశించారని, ఇది కాంగ్రెస్‌ విజయమన్నారు. సీపీఎస్‌ విధానంతో ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని, ఇదేనా ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అంటే? అని చిన్నారెడ్డి ప్రశ్నించారు. వెంటనే పీఆర్సీ కమిషన్‌ వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.