కరుణానిధికి నివాళులర్పించిన మోదీ

– కనిమొళి, స్టాలిన్‌లను ఓదార్చిన ప్రధాని

చెన్నై,ఆగస్టు8(జ‌నం సాక్షి): అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. బుధవారం ఉదయం చెన్నైకి చేరుకున్న ప్రధానికి తమిళ నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు స్వాగతం పలికారు. కాసేపటి క్రితం రాజాజీ హాల్‌కు వెళ్లి కలైంగర్‌ భౌతికా కాయానికి నివాళులర్పించారు. భావోద్వేగంతో ఉన్న కనిమొళి, స్టాలిన్‌లను ఈ సందర్భంగా మోదీ ఓదార్చారు. వారికి అండగా ఉంటామని అన్నారు. మరోవైపు ప్రధానితోపాటు రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి.. మంగళవారం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంత్రి చెందారు. ‘భారత రాజకీయ నాయకుల్లో అత్యంత సీనియర్‌ నేత కరుణానిధి. ఆయన మరణ వార్త తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసిందన్నారు. ఆలోచనాపరుడు, మాస్‌ లీడర్‌, గొప్ప రచయితను మనం కోల్పోయామని, ప్రజల సంక్షేమం కోసమే ఆయన తన జీవితాన్ని అంకింతం చేశారని ప్రధాని మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.