17న టిఆర్‌ఎస్‌ ఎంపి,ఎమ్మెల్యేల భేటీ

అధ్యక్షత వహించనున్న సిఎం కెసిఆర్‌

తాజా రాజకీయాలే లక్ష్యంగా సమావేశం

హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఆసిద్దంగా ఉన్న అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ అందుకు పావులు కదుపుతోంది. సోమవారం కార్యవర్గ భేటీలో పాల్గొని పలు అంశాలను చర్చించిన సిఎం కెసిఆర్‌ ఎంపిలు,ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర పార్టీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనుంది. సమావేశానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఇందులో చర్చించనున్నారు. సెప్టెంబర్‌ 2న హారీ సభకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఉంది. మరోవైపు ప్రస్తుత ప్రజాప్రతినిధులకే ఎంపి,ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని ప్రకటించినా ఎంతమందికి ఇస్తారన్నది కూడా వేచి చూడాల్సిందే. దీంతో పాటు ప్రస్తుత ఎంపిలు, ఎమ్మెల్యేల గెలుపు అవకాశాలను కూడా ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.