2014 ఎన్నికల్లో అన్నిస్థానాల్లో కేజ్రీవాల్ పార్టీ పోటీ
సంభాల్: అవినీతి వ్యతిరేకోద్యమ కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ స్థాపించబోయే పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని ఆయన బృందంలోని కీలకసభ్యుడు ఒకరు వెల్లడించారు. కుమార్ విశ్వాస్ అనే ఆ సభ్యుడు బుధవారంరాత్రి సంభాల్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఈ పార్టీ అభ్యర్థుల జాబితా మాత్రం ఢిల్లీలోనో, లక్నోలోనో తయారవదని, ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఒక సంస్థాగత ఏర్పాటు లేకపోవడంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, 1977లో జనతాపార్టీ కేవలం రెండునెలల్లోనే అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. తమసంస్థ 17 రాష్ట్రాల్లో నెలకొనిఉందని చెప్పారు. అన్నా హజారే, కేజ్రీవాల్‌లమధ్య విభేధాలగురించి మాట్లాడుతూ, ఇద్దరూ ఒకటే అని వ్యాఖ్యానించారు. వారి లక్ష్యాలు ఒకటేనని, అవినీతిపై ప్రజలలో అవగాహన కల్పించడమని అన్నారు.



