28వ రోజుకు చేరిన దీక్ష

ఆదిలాబాద్‌, జూలై 31 : తమ తమ కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని గత 27 రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం ముందు సాముహిక దీక్షలు చేపట్టిన అధికారుల్లో చలనం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. ఆదిలాబాద్‌ శివారులోని జాజి శంకర్‌, శ్రాస్తీనగర్‌ కాలనీల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 28వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఎన్నోమార్లు తమ సమస్యపై అధికారులకు వినతి పత్రాలను అందజేసినా లాభం లేకపోవడంతో సాముహిక దీక్షలు చేపట్టాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైన అధికారులు తమ మోరను విని తమ కాలనీల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించి అంధకారాన్ని తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని వారు హెచ్చరించారు.