దాద్రిపై నేరుగా స్పందించని ప్రధాని

5
– పరస్పరదాడులు వదిలి పేదరికంపై పోరాడండి

– బీహార్‌ ఎన్నికల ప్రచార సభలో మోడీ

హైదరాబాద్‌ అక్టోబర్‌8(జనంసాక్షి):

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా స్పందిచలేదు.  ఇప్పుడు కూడా నేరుగా దాద్రి ఘటన గురించి మాట్లాడకుండా పరోక్షంగా మాట్లాడారు. ఇప్పటివరకు మోదీ దాద్రి ఘటనపై మాట్లాడకపోవడం పట్ల ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.బిహార్‌లోని నవాడాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మోదీ దాద్రి ఘటనను పరోక్షంగా ప్రసంగంలోకి తీసుకొచ్చారు. భారత దేశంలో కీలక అంశాలైన వైవిధ్యం, సహనాన్ని ప్రజలంతా అర్థంచేసుకొని సఖ్యతగా ఉండాలని నిన్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పిన వ్యాఖ్యలను ప్రజలంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.హిందువులు, ముస్లింలు ఒకరిపై ఒకరు పోట్లాడుకోవాలా.. అందరూ పేదరికంపై పోరాడాలా.. అనే అంశం ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. అంతా కలిసికట్టుగా పేదరికంపై పోరాడాలని సూచించారు. ఒక సంఘటనను రాజకీయం చేయడాన్ని తాము సహించబోమన్నారు. కొంత మంది రాజకీయాల కోసం, చిన్న చిన్న లాభాల కోసం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని.. ప్రజలు వాటిని పట్టించుకోవద్దని కోరుతున్నానన్నారు. ఒకవేళ ప్రధాని మోదీనే అలాంటి మాటలు మాట్లాడినా పట్టించుకోవద్దన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సమీపంలో ఓ గ్రామంలో ఇటీవల 52ఏళ్ల మహమ్మద్‌ అక్ల్షా అనే వ్యక్తి పశుమాంసం తిన్నాడనే ఆరోపణలతో గ్రామస్థులు తీవ్రంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన అక్ల్షా కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై మౌనంగా ఉన్నారని విమర్శలు వస్తున్నాయి.

అటవికామ..? అభివృద్దా తేల్చుకోండి: బీహార్‌లో ప్రధాని

ప్రస్తుత శాసనసభకు జరగనున్న ఎన్నికల ద్వారా యువత బిహార్‌ ముఖచిత్రాన్ని మార్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. యువత చేతిలోనే ఈ రాస్ట్ర భవిత ఆధారపడి ఉందన్నారు. వీరంతా తగు నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందన్నారు. బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని  బిహార్‌లోని ముంగేర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగింస్తూ.. బిహార్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఆటవిక రాజ్యమా అభివృద్దా అన్నది తేల్చుకోవాలన్నారు. ఈసారి బిహార్‌ ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటు వేయాలన్నారు. అంతేగాకుండా  బిహార్‌ భవిష్యత్‌ కోసం ప్రజలు ఆలోచించాలన్నారు.  గత పాలకులు రాష్ట్రాన్ని దోచుకున్నారే తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఈ తరహా దోపిడీని అరికట్టాలన్నారు. .ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు కనుక అందుకు ముందుకు రావాలన్నారు.  ఇక్కడి ప్రజలు అభివృద్దిని తప్ప  ప్యాకేజీలను కాదని పేర్కొన్నారు. అందుకే బిహార్‌ భవిష్యత్‌ కోసం ప్రజలు ఆలోచించాలని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. గత పాలకులు బిహార్‌ను దోచుకున్నారే తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదని అలాంటి వారిని అధికారానికి దూరం చేయాలన్నారు. యోగా ద్వారా 190 దేశాలను ముంగేర్‌ ప్రభావితం చేయగలిగిందన్నారు. బిహార్‌ ఎన్నికల్లో ఏం జరగబోతోందో ఇంత ఉదయాన్నే భారీగా వచ్చిన జనాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. బిహార్‌లో అటవిక పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ఆటవిక పాలనలో అపహరణలు ఎక్కువ జరిగేవి… జనవరి నుంచి జులై వరకు 4 వేల అపహరణ ఘటనలు జరిగాయని తెలిపారు. ఇవన్నీ కావాలని ఇంకా కోరుకుందామా అని ప్రశ్నించారు. కనీసం రోడ్లు, మంచినీటి సమస్యలను కూడా తీర్చలేకపోయాన్నారు. ఇంతగా దగా జరిగినా ఇంకా సహిద్దామా అని అన్నారు.