మాయ మాటలు చెప్పి.. గర్భవతిని చేసి..

ఆర్మూర్, మార్చి 6 ( జనం సాక్షి): ఆర్మూర్ మండలం చేపూరు గ్రామంలో 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంపత్ అనే యువకుడిపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. చేపూర్ గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలిక జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. అదే గ్రామానికి చెందిన సంపత్ అనే యువకుడు గత మూడు సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు. ఈనెల మూడో తేదీన ఉదయం 9 గంటలకు బాలిక కళ్ళు తిరిగి ఇంటివద్ద పడిపోయింది. వెంటనే ఆర్మూర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా పరీక్షించిన వైద్యురాలు మైనర్ బాలిక మూడు నెలల గర్భవతి అని చెప్పడం జరిగిందన్నారు.ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైనా తల్లిదండ్రులు కూతురిని విషయం అడిగి తెలుసుకోగా.. చేపూర్ కు చెందిన సంపత్ అనే యువకుడు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఇంటి పక్కనున్న సందులోకి బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారం చేశాడన్నారు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను భయపెట్టాడని పేర్కొన్నారు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపి యువకుని పై కేసు నమోదు చేశారు. అత్యాచారం చేసి మైనర్ బాలిక గర్భవతి కావడానికి కారణమైన యువకుని పై సెక్షన్ 183/2024, 376(3)(2)(1), 506 సెక్షన్,5(1)2/W6, ఫోక్సో-2012 కింద కేసు నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.