రాజ్‌భనవ్‌కు పొయి రాజీనామా చేస్తా..!

C
– దమ్ముంటే ఆరోపణలు నిరూపించండి

– తప్పుడు కూతలు కూస్తే జైలుకు పంపుతా

– ఉత్తమ్‌కుమార్‌కు కేసీఆర్‌ సవాల్‌

-ముఖ్యమంత్రికి మహాస్వాగతం

హైదరాబాద్‌,ఆగస్టు 24(జనంసాక్షి): తెలంగాణ సిఎం కెసిఆర్‌ రాజీనామా సవాల్‌ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపథం చేశారు. పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అండ్‌ కో చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్‌ చేశారు. అలా చేస్తే తాను నేరుగా రాజ్‌భవన్‌  వెళ్లి రాజీనామాచేస్తానని అన్నారు. అంతేనా అంటే రాజీకయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. గోదావరి జలాల విషయమై మహారాష్ట్రతో చేసుకున్న చారిత్రాత్మక ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర పజలందరూ ఈ ఒప్పందంపై సంతోషంగా ఉన్నా.. కాంగ్రెస్‌ సన్నాసులు మాత్రం నల్లజెండాలు ప్రదర్శిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నేతలు అంతు, ఆధారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒప్పంద చేసుకుంటే ఆరేళ్లుగా తుమ్మడిహట్టి వద్ద ఎందుకు తట్టెడు మట్టి ఎందుకు ఎత్తి పోయేలేదన్నారు. నిన్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో అబద్దాలు మాట్లాడారని, 152 విూటర్లకు తమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్రంతో ఒప్పందం కుదిరిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారని అన్నారు. ‘ఇంకా 40 నిమిషాలపాటు నేను బేగంపేట ఎయిర్‌పోర్టులోనే ఉంటాను. నీకు దమ్ముంటే ఆ ఒప్పంద కాగితాన్ని తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కు రా. నేను ఇక్కడి నుంచే రాజ్‌భవన్‌కు వెళ్లి నా రాజీనామా సమర్పిస్తాను. రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. గోదావరి జలాల విషయం లో కాంగ్రెస్‌ నేతలు పచ్చి అబద్దాలను దారుణంగా మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. ఒకవేళ అబద్దాలు ఆడిత ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడతామని అన్నారు. వారికి జైలుకు వెళ్లి చిప్పకూడు తినక తప్పదన్నారు. కాళేశ్వరం నీళ్లతో ఉత్తర తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతానని సీఎం కేసీఆర్‌ అన్నారు. మహారాష్ట్రతో గోదారి నీటిపై ఒప్పందం కుదుర్చుకుని వచ్చిన సీఎం ఇవాళ ఈ వ్యాఖ్యలు చేశారు.  మహారాష్ట్రతో నీటి ఒప్పందం జరగడంతో ఈ రోజు గుండెల నిండా సంతోషం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో సీఎం మాట్లాడుతూ.. పంటలు ఎండిపోతుంటే.. గుండెలు తరుక్కుపోతున్నాయి. మొగులుకు ముఖం పెట్టి ఎదురుచూసే పరిస్థితి పోవాలి. కాంగ్రెస్‌ హయాంలో తమ్మిడిహట్టి వద్ద త్టటెడు మట్టి తవ్వలేదు. గతంలో బొట్టు నీటి చుక్క కోసం ఎంతో తపన పడ్డాం. ఇకపై రాష్ట్రంలో వర్షాలు కురిసినా.. కురవపోకపోయినా నీటికి ఇబ్బంది ఉండదు. జనాల్లో ఇంత సంతోషం చూస్తుంటే.. కాంగ్రెసోళ్లకు మాత్రం నల్ల జెండాలు కనపడుతున్నాయి. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పిందే నిజమైతే ఇటు నుంచే రాజ్‌భవన్‌కు పోయి రాజీనామా సమర్పిస్తా. ఇంకా గంట సేపు బేగంపేటలో ఉంటా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేటకు రా. అంటూ సవాల్‌ చేశారు. తెలంగాణ పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ కళ్ళలో నిప్పులు పోసుకుంటోంది. ఏ ఒక్క విషయంలో కూడా కాంగ్రెస్‌ కలిసిరావడం లేదు అని సీఎం ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా తాను నోరుమెదపకుండా ఉన్నానని అన్నారు. అయితే వారి అవకాకులుచవాకుల చూశాక ఇక నోరు విప్పాల్సి వచ్చిందన్నారు. అంతకముందు, తెలంగాణ బీడు భూముల్లో గోదావరి నీళ్లను పారించేందుకు మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకొని హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ కు అపురూప స్వాగతం లభించింది. రాష్ట్రానికి  జలసిరులు తీసుకొచ్చేలా ఒప్పందం చేసుకుని వచ్చిన జననేతకు ప్రజలు ఘన నీరాజనాలు పలికారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన అపర భగీరథుడికి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో సీఎంకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో రెండు వేల మంది కళాకారులు సీఎంను స్వాగతించారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముంబయి నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. మహారాష్ట్రతో నీటి ప్రాజెక్టులపై కీలక ఒప్పందం చేసుకొని హైదరాబాద్‌ చేరుకున్న కేసీఆర్‌ బృందానికి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనంగా స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా బేగంపేటలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ ఒప్పందంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నా.. కాంగ్రెస్‌ నేతలు మాత్రం నల్లజెండాలతో దర్శనమివ్వడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్‌కు కనబడటంలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల గోసకు బాధ్యులు కాంగ్రెస్‌ పాలకులు కాదా? అని నిలదీశారు. అనవసర ఆరోపణలు మానుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తుమ్మిడి హట్టిపై 152 విూటర్ల ఒప్పందం జరిగిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ చెబుతున్నారని.. ఆ ఒప్పందాన్ని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ఆ పేపర్‌ తీసుకొస్తే రాజీనామాకు తాను సిద్ధమని ప్రకటించారు. అదే నిజమైతే ఇప్పుడే బేగంపేట నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పిస్తానన్నారు. మా ప్రభుత్వం నిప్పులా పనిచేస్తుందని కేసీఆర్‌ అన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో అవినీతిరహిత పాలన కొనసాగు తోందన్నారు. ఇలాగే అనవసర ఆరోపణలకు పాల్పడితే కాంగ్రెస్‌ గుట్టును ప్రజలముందు పెడతామని కేసీఆర్‌ హెచ్చరించారు. తాను జగమొండి అని.. పట్టుబడితే వెనక్కిపోయే ప్రసక్తే లేదన్నారు. ఏ పని చేపట్టినా అది సఫలీకృతమయ్యే వరకు వెనక్కి తగ్గనని స్పష్టంచేశారు. అందుకోసం ప్రాణాలు బలిపెడతాను.. త్యాగాలు, రాజీనామాలకు సిద్ధపడతాను తప్ప ఇచ్చిన మాటనుంచి వెనక్కి పోయే ప్రసక్తే లేదని కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరంలో నీటితో ఉత్తర తెలంగాణలో నీటిని తెస్తామని హావిూ ఇచ్చారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రెండు పంటలు పండేలా సాగునీరందిస్తామని హావిూ ఇచ్చారు. గోదావరి మిగులు జలాల వాటా కోసం ప్రధాని వద్దకు హరీశ్‌రావు నేతృత్వంలో బృందాన్ని పంపిస్తామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు కృష్ణా, గోదావరి జలాలు తెచ్చి తీరుతామని ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రకటించారు. కోటి ఎకరాల పచ్చని తెలంగాణ సాధించుకొనే వరకు వెనక్కి పోయేదిలేదన్నారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఆలోచన, అవగాహన, తెలివి లేవని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఆధారాల్లేకుండా మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించారు.

రెండేల్లలో నీళ్లు తెచ్చి చూపిస్తాం

తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న నదీ జలాల ఒప్పందం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ఒప్పందం రాష్ట్రంలో చిరకాలం, కలకాలం పంటలు పండించే వరప్రదాయని అని ఆయన అభివర్ణించారు. మహారాష్ట్రతో గోదారి నీటిపై ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్‌ బృందం బుధవారం బేగంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో   సీఎం మాట్లాడుతూ ఏడాదిగా ఈ ఒప్పంద కోసం తండ్లాడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాధార పంటలు ఎండిపోతున్నాయని, వర్షాల కోసం రైతులకు దేవుళ్లకు మొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లు గడిస్తే కాళేశ్వరం, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మెదక్‌ జిల్లావరకు నీళ్లు వస్తే మన పంటలు ఎండని పరిస్థితి ఉంటుందని అన్నారు. రెండుపంటలకు నీరందిస్తామని అన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురిసినా, కురవకపోయినా పచ్చటి తెలంగాణ ఉంటుందని ఆయన అన్నారు. ఏడాదిన్నర కాలంగా మహారాష్ట్రతో చర్చలు జరిపి, ఒప్పందం చేసుకున్నామని, ప్రజలు సంతోషపడుతున్నారని, కాంగ్రెస్‌ సన్నాసులకు మాత్రం నల్లజెండాలు కనబడుతున్నాయని కేసీఆర్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలపై నిప్పులు చెరిగారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అండ్‌ కంపెనీ, టిడిపి కంపెనీ మాట్లాడుతున్నారని అన్నారు. ఆనాడగు అభివృద్ది కావాలని, తెలంగాణ వద్దని అన్న సన్నాసులన్నారు. ఆనాడు వైఎస్‌ పంచన చేరి తెలంగౄణకు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఓర్వలేక అసత్యాలు పదే పదే చెబుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తునారని ఫైర్‌ అయ్యారు. రెండేల్లుగా అవినీతి రహిత పాలన సాగుతోందన్నారు. ప్రధాని కూడా అభినందించారని అన్నారు. రాబోయే రోజుల్లో టీవీ ఛానల్‌లో కూర్చుకుని కాంగ్రెస్‌ బండారం బయటపెడతానని అన్నారు. 98 లక్షల ఎకరాలకు నీరిస్తే అవి ఎటుబోయినవి, పిట్టలు తాగినయా?.. నీళ్లిచ్చింది నిజమైతే తెలంగాణకు ఈ గోస ఎందుకుంటుండే.. అని కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు. కాంగ్రెస్‌ సన్నాసుల వల్లే తెలంగాణ ఆగమయిందని, ఇవాళ తెలంగాణను బాగుచేసుకునే పనిలో తండ్లాడుతుంటే ఓర్వలేక అడ్డుపడుతున్నరని ఫైర్‌ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ కొట్లాడుతుంటే ఇదే కాంగ్రెస్‌ దద్దమ్మలు ఆనాడు ఎగతాలి చేశారని, ఆంధ్రా ముఖ్యమంత్రుల సంకలో చేరి తెలంగాణకు అన్యాయం చేశారని మండి పడ్డారు. తెలంగాణ గోసకు  కాంగ్రెస్‌దే బాధ్యతని ఆయన ఆరోపించారు. తమ్మిడిహట్టి ఒప్పందం జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని కేసీఆర్‌ ప్రశ్నించారు. కనీసం త్టటెడు మట్టి కూడా తవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. ఇప్పుడు మంచి జరుగుతుంటే ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని, కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, తెలంగాణను కాంగ్రెస్‌ సర్వ నాశనం చేసిందని కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌ నిజాయితీగా ఉంటే గులాబీ జెండా ఎందుకు పుడుతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కిరికిరితో తన ఏకాగ్రతను దెబ్బతీయలేరని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలులేని ఆరోపణలు చేస్తే ఇకపై కేసులు పెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతలకు తెలివి, అవగాహన లేదని ఆయన ఎద్దేవాచేశారు. కోటి ఎకరాలకు గోదావరి, కృష్ణా జలాలు తీసుకొస్తానని స్పష్టం చేశారు. కాళేశ్వరం కట్టి ఉత్తర తెలంగాణలో 2పంటలు పండించి చూపిస్తానని శపథం చేశారు. గోదావరి మిగులుజలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని ప్రశ్నించారు. ఆంధ్రాతో తెలంగాణను కలిపిందే కాంగ్రెస్సేనని ఆరోపించారు. నందికొండను నాగార్జునసాగర్‌గా మార్చి అన్యాయం చేశారని మండిపడ్డారు. తెలంగాణకు న్యాయం చేసివుంటే టీఆర్‌ఎస్‌ ఎందుకు పుట్టేదా అని కాంగ్రెస్‌ నేతలను మరోసారి కేసీఆర్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ విచ్ఛిన్నానికి చంద్రబాబు, వైఎస్‌ కుట్రలు చేస్తే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మమ్మల్ని ఎగతాళి చేశారని మండిపడ్డారు. ఉద్యమంలో ఏనాడు తమతో కలిసి రాలేదని కేసీఆర్‌ ఆరోపించారు. రాజీనామాలకు, త్యాగాలకు తాము పెట్టింది పేరని, అందుకే తీసుకో నీ తెలంగాణ అని మా చేతిలో పెట్టారని అన్నారు.