విచారణలో నిజాలు తేలేనా?

వరంగల్‌, నల్లగొండ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఘటనలో వికారుద్దీన్‌ సహా ఐదుగురు ఖైదీలు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ను వికారుద్దీన్‌ తండ్రి హైమద్‌ తీవ్రంగా ఖండించారు. దీనిపై విచారణ జరిపించాలని ఇటు వికార్‌, అంజాద్‌ల కుటుంబ సభ్యుల నుంచే కాక పలు ప్రజాసంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తటం, ముఖ్యంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేయటమే కాక విచారణకు డిమాండ్‌ చేయటంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘటనపై సిట్‌ వేసేందుకు ఆదేశాలు జారీచేశారు. ఘటన జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికే ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన ఎస్కార్ట్‌ పోలీసులపై కేసు నమోదు చేయాలని వికారుద్దీన్‌ తండ్రి ఆలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దీనిపై విచారణ జరుగుతోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టంచేశారు. అయితే విచారణకు సిట్‌ వేయాలని డిమాండ్లు రావటంతో ముఖ్యమంత్రి ప్రత్యేక విచారణకు ఆదేశించారు. అయితే ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎస్కార్ట్‌ వాహనంలో ఖైదీలను తరలిస్తున్న పోలీసులు బేడీలతో ఖైదీలను బంధించి, బస్సుకు వాటితో తాళాలు వేసి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుని తరలిస్తారు. మరి ఇంత పక్కాగా భద్రతా ప్రమాణాలు పాటించినప్పుడు పోలీసులు చెప్తున్నట్లుగా నిందితులు వారిపై దాడికి యత్నించే పరిస్థితి ఉండదు. ఘటన జరిగిన తీరుపై ఘటనాస్థలంలో తీసిన ఫుటేజీ చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోందని వికారుద్దీన్‌ తండ్రి అంటున్నారు. 17 మంది ఎస్‌1 ఎస్కార్ట్స్‌ ఉన్న నేపథ్యంలో కేవలం 5గురు నిందితులు, అది కూడా బేడీలతో బంధించి ఉన్న వారు దాడికి యత్నించే అవకాశమే లేదు. పోలీసులు చెప్తున్నట్లుగా ఆయుధాలు లాక్కోవటానికి పెనుగులాట జరిగి ఉంటే అందుకు అవకాశాలున్న దాఖలాలు కనిపింఛడంలేదు, బేడీలతో వాహనానికి బంధించి ఉన్న వారు పోలీసుల దగ్గరున్న ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేస్తారన్నది సాధ్యంకాని పని. అయితే సిమి ఉగ్రవాదులు నల్లగొండ జిల్లాలో నలుగురు పోలీసులను పొట్టనబెట్టుకున్న ఘటనకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందనే వాదనలకు బలం చేకూరుస్తూ సంఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలు కనిపిస్తున్నాయి. నిందితుల మృతదేహాలు వాహనాల్లోని సీట్లపై ఎక్కడివారు అక్కడే పడ్డట్టుగా ఉన్నాయి. కానీ ఈ ఎన్‌కౌంటర్‌ బూటకం అంటూ అసలు ఎదురు కాల్పులే జరగలేదని, ఏకపక్షంగా కాల్పులు జరిగాయంటూ హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలో ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్‌ సభ్యులు, మరికొందరు వ్యక్తిగతంగా, తెలంగాణ పౌరహక్కుల సంఘంతోపాటు మానవ హక్కుల సంఘాలు ముఖ్యమంత్రిని కలిసి విచారణ జరపాలని కోరాయి. ఆ విచారణ కూడా సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేశాయి. ఆరోపణ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మీద. స్టేట్‌ పరిథిలోని సంస్థలే విచారణ చేపడితే ఆ విచారణ నివేదికలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ప్రతిపక్ష రాష్ట్రాల్లో ముఖ్యంగా గుజరాత్‌ రాష్ట్రంలో జరిగిన సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌, ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌లలోనే కాస్త భిన్నమైన నివేదికలు వచ్చాయి. అదిలాబాద్‌ జిల్లా వాంకిడి అటవీ ప్రాంతంలో జోగాపూర్‌లో జరిగిన ఎదురు కాల్పులుగా చెప్పబడిన ఘటనలో సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు ఆజాద్‌తోపాటు జర్నలిస్ట్‌ హేమచంద్రపాండే మృతి చెందారు. దేశంలో మొదటిసారి మావోయిస్టు పార్టీ ఎన్‌కౌంటర్‌లపై సీబీఐ విచారణ చేపట్టింది. జేడీ లక్ష్మినారాయణ నేతృత్వంలో చేపట్టిన ఈ విచారణస నివేదికలో ఎక్కడా సీబీఐ అనుమానాలు వ్యక్తపరచలేదు. ఎన్‌కౌంటర్‌ నిజమైనదిగానే పేర్కొంది. గతంలో జస్టిస్‌ భార్గవ కమిషన్‌, జస్టిస్‌ టీఎల్‌ఎన్‌రెడ్డి నివేదికలు కూడా రాష్ట్రప్రభుత్వం ఆమోదించలేదు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు గులాం రసూల్‌ ఎన్‌కౌంటర్‌పై వేసిన టీఎల్‌ఎన్‌రెడ్డి కమిషన్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణకంటే గులాం రసూల్‌కు అప్పటి పీపుల్ల్‌ వార్‌ పార్టీతో సంబంధాలు ఉన్నాయా లేదా అన్న కోణంలోనే ఎక్కువ విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వమే విచారణ జరుపుకుంటే వచ్చే నివేదికలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇక వికారుద్దీన్‌ విషయానికొస్తే వికార్‌ హైదరాబాద్‌లోని ఓల్డ్‌ మలక్‌పేట వాస్తవ్యుడు. ముసరాంబాగ్‌లోని బిలాల్‌ అనే వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఉగ్రవాదంపై వెళ్లాడు. 2007 నుంచి నేటి వరకు వికారుద్దీన్‌ పేరు తెలియని వారు ఉండరు. పోలీసులను ఇష్టమొచ్చినట్లు తిట్టిన నేరస్తుడుగా అతగాడు ఖాకీలకు ఎరుకే. అయితే 2007 మే 18న మక్కా పేలుళ్లల అనంతరం వికారుద్దీన్‌ ఉగ్రవాద బాటలోకి అడుగుపెట్టాడు. ఆనాటి నుంచి నేటి వరకు మే 18న ఏదో ఒక అలజడి సృష్టించేందుకు వికారుద్దీన్‌ ప్రయత్నించాడు. మక్కాపేలుళ్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన వికారుద్దీన్‌ను 2010లో పోలీసులు అరెస్టు చేశారు. 2008, డిసెంబర్‌లో సంతోష్‌నగర్‌లో కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సిబ్బందిపై సహచరులతో కాల్పులు జరిపి పారిపోయాడు. 2009 మే 18న పికెట్‌ డ్యూటీలో ఉన్న ఫలక్‌నూమా పీఎస్‌ కానిస్టేబుల్‌ రాజేంద్రప్రసాద్‌, ¬ంగార్డు బాలస్వామిలపై కాల్పులు జరిపాడు. బాలస్వామి ప్రాణాలు కోల్పోయాడు. ఆ రోజే అక్కడ ఓ లేఖ వదిలి వెళ్లాడు. ప్రతి ఏడాది మే 18న పోలీసులకు ఇదే జరుగుతుందంటూ తహరీక్‌ గుల్బా-ఎ-ఇస్లాం పేరిట ఓ లేఖను వదిలి వెళ్లాడు. లేఖలో చెప్పినట్లు గానే 2010 మే 14(నాలుగు రోజుల ముందే)న పాతబస్తీ ఖిల్వత్‌ రోడ్డులో పికెట్‌ డ్యూటీలో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ రమేశ్‌ను కాల్చిచంపాడు. అనంతరం వికారుద్దీన్‌ కోసం పోలీసులు వేట ప్రారంభించారు.2010 జులై నెలలో పోలీసు బలగాలు వికారుద్దీన్‌ ఉంటున్న ప్రాంతాన్ని కనుగొన్నాయి. హైదరాబాద్‌లోని బౌద్ధనగర్‌ ప్రాంతంలోని షాబాద్‌గూడలో ఆటో డ్రైవర్‌ హాఫీజ్‌ ఇంట్లో తమ్ముడు సులేమాన్‌తో వికార్‌ కలిసి ఉంటున్నట్లు పోలీసులు కనుగొన్నారు. జులై 11న(ఆదివారం) వికారుద్దీన్‌ కూరగాయాలు కొనడానికి బయటకు రాగానే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాయి. సులేమాన్‌ను కూడా అరెస్టు చేశారు. బౌద్ధనగర్‌లో వీరికి ఇల్లు అద్దెకు ఇప్పించడానికి సహకరించింది యునానీ డాక్టర్‌ హనీఫ్‌. హనీఫ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వికార్‌ అతడి సహచరుల నుంచి 3 షార్ట్‌ వెపన్లు, 35 బుల్లెట్లు, నాలుగు పిస్టల్‌ మ్యాగజైన్లు, ఓ డాగర్‌, కత్తి, సీడీలు, పెన్‌డ్రైవ్‌, నాలుగు బైక్‌లు, రెండు నకిలీ విూడియా గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌, బాలస్వామిపై కాల్పుల కేసులో వికారుద్దీన్‌ను అరెస్టు చేసినట్లు ఏకే ఖాన్‌ తెలిపారు. అప్పటి నుంచి వికారుద్దీన్‌ జైలులోనే ఉంటున్నారు. చంచల్‌గూడ జైలులో జైలు వార్డర్లపై దాడి చేశారు. ఇక అటు నుంచి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు వికారుద్దీన్‌ గ్యాంగ్‌ను తరలించారు. వేషం మార్చడంలో దిట్ట అయిన వికారుద్దీన్‌కు ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయని పోలీసుల వద్ద సమాచారం ఉంది. సిమిలో కూడా క్రియాశీలక పాత్ర పోషిం చాడు. డీజేఎస్‌ పేరుతో పలు నేర కార్యకలాపాలు నిర్వహించాడు. చివరకు నల్లగొండ, వరంగల్‌ సరిహద్దుల్లో పోలీసు కాల్పుల్లో వికారుద్దీన్‌ సహా అతని అనుచరులు నలుగురు హతమయ్యారు. ఏదేమైనా ఎన్‌కౌంటర్‌పై సరైన విచారణ జరిగి నిజానిజాలు బయటికి వస్తాయని ఆశిద్దాం.