రాష్ట్రపతి పాలనంటే.. సైనిక పాలన కాదు

రాష్ట్రంలో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలనపై ప్రజల్లో అనవసర భయాందోళనలు రేకెత్తించడమే పనిగా కొందరు కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది. రాష్ట్రపతి పాలనంటే అదేదో సైనిక పాలన ప్రజలపై మోపినట్టు అత్యవసర పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొనబోతున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించజూస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు రాష్ట్రపతి పాలన నేపథ్యంలో రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించబోతున్నట్లు డీజీపీ ప్రసాదరావు విలేకరుల సమావేశం నిర్వహించి చెప్పడం మరింత గందరగోళానికి తెరతీసింది. రాష్ట్రపతి పాలనంటే రాజ్యాంగవిరుద్ధమైన పాలన అన్నట్టుగా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. గోరంతను కొండతలు చేసే తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియా మిడిమిడి జ్ఞానంతో సాగిస్తోన్న చర్చోపచర్చలు ప్రజల్లో మరింత గందరగోళానికి తావిస్తున్నాయి. ఏ ఇద్దరు కలిసినా రాష్ట్రపతి పాలన వల్ల ఏవో విపరిణామాలు సంభవిస్తాయట కదా? అని చర్చించుకోవడం.. అలాంటి చర్చలు సాగిస్తున్న వారిలో విద్యావంతులు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్వతంత్ర భారత దేశం ఒకే ఒక్కసారి అత్యయిక పరిస్థితిని ఎదుర్కొన్నది. అలహాబాద్‌ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఇందిరాగాంధీ దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. ప్రజాస్వామిక పాలన స్థానే దేశం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నది. ఎందరో ప్రజాస్వామికవాదులు జైళ్ల పాలయ్యారు. పత్రికలపైనా నిర్బంధం కొనసాగింది. పాలన పగ్గాలు బ్యూరోక్రాట్ల చేతుల్లోకి వెళ్లాయి. వారు చెప్పిందే వేదం చేసిందే చట్టమన్నట్టుగా అప్పట్లో ఉండేది. ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిర్బంధంలోనూ ప్రజోద్యమం పెల్లుబికింది. ఫలితంగా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. అప్పుడు తప్ప దేశ ప్రజలెప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనలేదు. కొన్ని సందర్భాల్లో పాలకపక్షాలు నిరంకుశంగా వ్యవహరించిన సందర్భాలున్నా అందుకు తర్వాతి ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నాయి ఆ పార్టీలు. దేశంలో ఇప్పటి వరకూ వందకుపైగా సందర్భాలాల్లో వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అత్యధికంగా పది పర్యాయాలు రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రస్తుతం దేశంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది సార్లు ప్రెసిడెంట్‌ రూల్‌ పెట్టారు. రాష్ట్రాల్లో ప్రజాపాలన సాధ్యం కాని పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ప్రజాస్వామిక ప్రభుత్వం స్థానే రాష్ట్రపతి పక్షాన ఆ రాష్ట్ర గవర్నర్‌ పాలన పగ్గాలు స్వీకరిస్తారు. రాష్ట్రపతి నియమించే సలహాదారులు ఆయనకు పరిపాలన వ్యవహారాల్లో సహకరిస్తారు. రాష్ట్రపతి నియమించే సహాయకులు ఇన్నాళ్లు ముఖ్యమంత్రి, మంత్రులు స్థానే పరిపాలన బాధ్యతలు నిర్వరిస్తారు. కీలకమైన నిర్ణయాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి సాధారణ పరిపాలన పరమైన నిర్ణయాలను వారే స్వయంగా తీసుకుంటారు. అలాగే లా అండ్‌ ఆర్డర్‌ విధులు నిర్వర్తించే పోలీసులు కూడా గవర్నర్‌ నేతృత్వంలో విధులు నిర్వర్తిస్తారు. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రితో భేటీ అయి కీలకమైన అంశాలను వెల్లడించే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఇకపై నేరుగా గవర్నర్‌కు కానీ, ఆయన నియమించే సలహాదారుల్లో శాంతిభద్రతలను చూసే బ్యూరోక్రాట్‌తో కానీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వెల్లడిస్తారు. గవర్నర్‌ సలహా మేరకు ఆయన సలహాదారులు అత్యవసరమైన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. పాలన పరమైన వ్యవహారాల్లో కలెక్టర్లకు అవసరమైన సూచనలు ఇస్తుంటారు. పరిపాలన వ్యవహారాల్లో రాష్ట్రపతి నియమించే ఇద్దరు అధికారులే కీలకంగా వ్యవహరిస్తారు. వారి నేతృత్వంలో సాధారణ పరిపాలన యథావిధిగా సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు అంటే ఉద్యోగాల భర్తీ, ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూ కేటాయింపులు, రాయితీలు, బడ్జెట్‌ కేటాయింపులు, నిధుల విడుదల లాంటి కీలకమైన అంశాలు మినహా పౌర జీవనానికి ఎలాంటి ఆటంకం వాటిల్లకుండా పాలన సాగుతోంది. కాకపోతే ప్రజాస్వామిక ప్రభుత్వం స్థానే గవర్నర్‌ సలహాదారులు పరిపాలన వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. పాలనలో గవర్నర్‌కు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తుంటారు. గవర్నర్‌కు సలహాదారులుగా నియమించే ఇద్దరు అధికారులు సీనియర్‌ ఐఏఎస్‌లే. వారిలో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాగా మరొకరు ఇతర రాష్ట్రానికి చెందిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారి ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న పాలన వ్యవహారాలు చక్కబెట్టేది ఐఏఎస్‌ అధికారులే. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటూ వారు సాధారణ రోజుల్లో పాలన సాగిస్తారు. రాష్ట్రపతి పాలన కాలంలో రాష్ట్రపతికి అంటే భారత రాజ్యాంగానికి లోబడే, రాజ్యాంగానికి జవాబుదారీగానే వారు నడుచుకుంటారు తప్ప ఎలాంటి అసాంఘిక, అనాలోచిత, అనుచిత నిర్ణయాలకు చోటుండదు. ఇలాంటి పరిస్థితిని దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ఇప్పటి వరకు ఎదుర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే రెండు పర్యాయాలు రాష్ట్రపతి పాలన విధించారు. యాథృచ్చికంగా రెండు సందర్భాలూ రాష్ట్ర విభజనకు సంబంధించినవే. 1973లో తలెత్తిన జై ఆంధ్ర ఉద్యమం వల్ల రాష్ట్రం ఒకసారి రాష్ట్రపతి పాలనను ఎదుర్కొనగా తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ అంతగా ఆసక్తి చూపలేదు. అన్నట్టుగానే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన రోజునే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీపై కసరత్తు పూర్తి చేసింది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి మే నెలాఖరులోగా దేశవ్యాప్తంగా ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు రాష్ట్రపతి పాలన ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ దానితో ఎదురయ్యే దుష్పరిణామాలేమి లేవు. రాష్ట్రపతి పాలనలో పాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ తమ విధులు నిర్వహిస్తాయి. ఇలాంటి సందర్భంలో ప్రజలకు రాష్ట్రపతి పాలనపై అవగాహన కల్పించాల్సిన మీడియా తన బాధ్యతను విస్మరించడం భావ్యం కాదు. రాష్ట్రపతి పాలన వల్ల పోలీసు రాజ్యంగానీ, సైనిక పాలన కానీ ఎదురుకావు. ప్రజలు అపోహలను తొలగించుకోవాలి. రాష్ట్రపతి పాలనలోనూ సాధారణ జీవితం గడపవచ్చని గుర్తించాలి.