బాసరలో వసంతపంచమి రద్దీ
నేటి అక్షరాస్యాలకు భారీగా భక్తులు
పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వం
బాసర,ఫిబ్రవరి4(జనంసాక్షి ): వసంతపంచమిని పురస్కరించుకుని బాసర సరస్వతీ ఆలయం భారీగా అక్షరాభ్యాసాలకు సిద్ధమైంది. ఏటా మాఘశుద్ధ పంచమి అమ్మవారి జన్మదిన వేడుకలకు ఆలయం ముస్తాబైంది. వేదవ్యాసుడి సృష్టి అయిన బాసర ఆలయంలో వసంతపంచమి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. పరమ పవిత్రమైన ఈ రోజున అమ్మవారి సన్నిధిలో గడిపేందుకు, దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు అశేషసంఖ్యలో భక్తులు బాసరకు తరలి వస్తారు. వసంతపంచమిని పురస్కరించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పిస్తారు. చిన్నారుల అక్షరాభ్యాసాలు భారీగా జరుగుతాయి. దక్షిణ భారతవనిలో నెలకొని ఉన్న ఏకైక సరస్వతీ ఆలయంలో కావడంతో ఆదివారం అక్షరాభ్యాసాలకు భారీగా చిన్నారులు తరలిరానున్నారు. అమ్మవారి జన్మదిన వేడుకలతో ఇప్పటికే బాసర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చిన్నారుల అక్షరశ్రీకారానికి దివ్యమైన ముహుర్తం కావటంతో ఆదివారం బాసరలో భారీగా అక్షరాభ్యాసాలు జరుగనున్నాయి. దీంతో బాసర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఏటా మాఘమాసంలో వచ్చే శుద్ధపంచమిని వసంత పంచమిగా నిర్వహిస్తారు. ఈరోజునే శ్రీపంచమి, మదన పంచమిగా కూడా వ్యవహరిస్తారు. మంచిపనులకు, చిన్నారుల అక్షరాభ్యాసాలకు విశిష్టదినంగా భావిస్తారు. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరుస్తారు. మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవతో అమ్మవారి జన్మదిన వేడుకలకు, పూజ కార్యక్రమాలకు అంకురార్పణ జరుగుతుంది. అనంతరం అమ్మవారికి అభిషేకం, అలంకరణ, నివేదన, మంగళహారతి నిర్వహిస్తారు. అభిషేక కార్యక్రమ అనంతరం అక్షరాభ్యాసాలు ప్రారంభమవుతాయి. రోజంతా ఆలయంలో కుంకుమార్చన పూజలు, చండీహవనం, వేదపారాయాణాలు జరుగుతాయి. శనివారం జరిగే వసంత పంచమి ఉత్సవంలో పాల్గొనేందుకు ఉదయం నుంచే భక్తులు బాసరకు తరలివచ్చారు. ఉత్సవ నిర్వహణలో లోటుపాట్లు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేస్తున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో అధికారులు అపశ్రుతులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు.