అందమైన యువతులను ఆశ చూపి హత్యలు చేసే ముఠా అరెస్ట్
అమరావతి: అందమైన యువతులను ఆశ చూపించి హత్యలు చేసిన గ్యాంగ్‌ను శ్రీకాళహస్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, 2015 డిసెంబర్ 23వ తేదీన పట్టణంలోని ఓ లాడ్జిలో శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును విచారణ చేపట్టిన పోలీసులకు దర్యాప్తులో దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. కేసు విచారణలో భాగంగా శ్రీకాళహస్తి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయున్, సత్యా రామచంద్రన్ అనే జంటను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో విజయున్, సురేష్ అనే ఇద్దరు సత్యా రామచంద్రన్ అనే యువతిని పలువురికి ఆశ చూపించి బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారని, ఎదురుతిరిగిన వారిని హత్య చేస్తున్నారని తెలిపారు. శ్రీనివాస్‌ను కూడా వీరే హత్య చేశారని విచారణలో అంగీకరించారని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 22వ తేదీన శ్రీకాళహస్తిలోని నగిరి వీధిలో ఓ లాడ్జిలో రూమ్‌ని అద్దెకు తీసుకున్నారు. పక్కరూమ్‌లో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తిపై వీరి కన్ను పడింది. విజయన్ స్వయంగా శ్రీనివాస్ ను పరిచయం చేసుకుని సత్యను చూపించాడు. ఆమెను చూసిన శ్రీనివాస్ కూడా అంతే త్వరగా బుట్టలో పడ్డాడు.ఆ తర్వాత శ్రీనివాస్ వద్ద ఉన్న రూ.6 వేలు నగదు, సెల్‌ఫోన్‌ను ఇవ్వాలని బెదిరించారు. శ్రీనివాస్ ప్రతిఘటించడంతో హత్య చేశారని వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు అప్పట్లో పెద్దగా ఆధారాలేవీ దొరకలేదు. తాజాగా శ్రీకాళహస్తి మండలంలోని తొండవునాడు క్రాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయున్, సత్యారామచంద్రన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసిందన్నారు. వీరితో పాటు సురేష్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడని, గతంలో వీరు చేసిన హత్యలపై దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కేసును త్వరగా ఛేదించిన కానిస్టేబుళ్లు గోపి, చంద్రశేఖర్, సుబ్రమణ్యంను డీఎస్పీ అభినందించారు. గుర్తింపు ఉంటేనే గదులు అద్దెకు ఇవ్వాలని లాడ్జీ నిర్వాహకులను ఆదేశించారు.