ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

విజయనగరం : ఉత్తరాంధ్ర జిల్లాలను ఈదురుగాలులు వణికిస్తున్నాయి.విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, గజపతినగరం ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకటిని తలపిస్తోంది. విజయనగరం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. భోగాపురం మండలం పెద్దకొండరాజుపాలెం వద్ద సముద్ర తీరంలో పడవలను ఒడ్డుకు చేర్చుతుండగా బలమైన ఈదురుగాలులకు ఓ వ్యక్తి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సముద్రంలో గల్లంతైన బొందు చిన్న అమ్ములు(30) స్థానికులు గాలిస్తున్నారు.

 అలాగే విశాఖపట్నంలోని పాడేరు, తగరపువలస, విశాఖ నగరంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు పొంగిప్రవహిస్తోంది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. జ్ఞానాపురం జంక్షన్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిలాల్లో పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు కూలిపోయి విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది.

అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే అకాల వర్షాలు పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.  కోస్తా జిల్లాల్లో రాగలం 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావంతోనే ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

తాజావార్తలు