కాల్ మనీ-సెక్స్ రాకెట్!: గుంటూరులోనే ప్రారంభం
విజయవాడ: బెజవాడలో కాల్ మనీ వ్యాపారుల కీచకపర్వం బట్టబయలు కావడంతో గుంటూరులో ఇదే వ్యాపారం చేస్తున్న వారు ఉలిక్కిపడుతున్నారు. కాల్ మనీ వ్యాపారానికి గుంటూరు పెట్టింది పేరు. ఇక్కడి నుంచే రాష్ట్రం మొత్తానికి ఈ వ్యాపారం పాకిందనే వాదనలు ఉన్నాయి. ఈ డబ్బునంతా చాలా వరకు ఆయా పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, కొందరు పోలీసు అధికారులవేనని చెబుతుంటారు. అయితే వీరు ఎవరూ కూడా తెరపైన కనిపించరని, రుణం తీసుకున్న వారు పేచీలు పెడుతుంటే మాత్రం సదరు నాయకులు, అధికారులు రంగ ప్రవేశం చేస్తారని బాధితులు చెబుతుంటారని తెలుస్తోంది. కాల్ మనీ చేసే ప్రతి ముఠా వెనుక నాయకుల అండ ఉందని చెబుతున్నారు. బెజవాడ కాల్ మనీ దందాలో అన్ని పార్టీల రాజకీయ వారు ఉన్నారని టిడిపి నేత బుద్ధా వెంకన్న కూడా చెప్పారు. కాల్ మనీ దందాలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
అప్పు చెల్లిస్తామన్నా తీసుకోరు! అవసరంలో ఉన్న వారికి కాల్ మనీ దందా చేసే వారు అప్పు ఇస్తారు. వారి నుంచి పెద్ద ఎత్తున వడ్డీ తీసుకుంటారు. బాధితులు గడువులోగా అప్పులు తీర్చుతామని చెప్పినా కాల్ మనీ నిందితులు తీసుకోరు. గడువు ముగిశాక మాత్రం వేధిస్తారు. గడువు ముగిశాక బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం, ఎక్కువ డబ్బులు తీసుకోవడం, మహిళలను అయితే వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యభిచారంలోకి దిగితే రోజుకు మీరే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చునని బాధితులకు నిందితులు చెబుతుంటారని తెలుస్తోంది. వేలు ఇచ్చి లక్షలు, లక్షలు ఇచ్చి కోట్ల రూపాయలను వారు వసూలు చేస్తున్నారు. కాల్ మనీలో ఎన్నారైలు, ప్రముఖ వ్యాపారులు కూడా పెట్టుబడులు పెట్టి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. అప్పుల పేరిట బంగారు ఆభరణాలు వశం చేసుకుంటారు. అప్పులిచ్చి మహిళల్ని బలవంతంగా వశపరుచుకొని వారితో వ్యభిచారం చేయిస్తున్న కాల్ మనీ ముఠాలు కూడా ఉన్నాయి. ఫిర్యాదుల వెల్లువ కాల్ మనీ వ్యాపారుల చేతిలో మోసపోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాల్ మనీ – సెక్స్ రాకెట్ బాధితులు నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేయాలని సిపి గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. కాల్ మనీ బాధితులు పోలీసులను, సిపిని ఆశ్రయిస్తున్నారు. బాధలు వెళ్లబోసుకుంటున్నారు.