కృపామణి కేసు: సాయి శ్రీనివాస్ పెన్ డ్రైవ్‌లో వంద మంది మహిళల అశ్లీల చిత్రాలు
ఏలూరు: కృపామణి హత్య కేసులో ప్రధాన నిందితుడైన గుడాల సాయి శ్రీనివాస్ ఆచూకీని పోలీసులు ఇప్పటి వరకు కూడా పట్టుకోలేకపోయారు. అతడి నివాసంలో దొరికిన మెమొరీ కార్డులో డేటాను విశ్లేషిస్తున్నారు. అతడి ఇంట్లో పోలీసులకు దొరికిన పెన్ డ్రైవ్‌లోనూ కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. వందమందికి పైగా యువతులు, మహిళలకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు ఉన్నట్టు సమాచారం. తనతో సన్నిహితంగా ఉండే మహిళల దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసేవాడని అతడిపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. పెరవలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. కానీ, అతని ఆచూకీ మాత్రం పోలీసులు ఇప్పటికీ కనిపెట్టలేక పోతున్నారు. కృపామణి ఆత్మహత్య కేసులో కృపామణి తల్లిదండ్రులు, సోదరుడు, వీరికి ఆశ్రయమిచ్చిన మంగ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కానీ, సాయి శ్రీనివాస్‌ని ఇంకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. అతడు విశాఖలోనే ఉన్నాడా? ఎక్కడికైనా పారిపోయాడా? అనే విషయంపై పోలీసులకు కూడా స్పష్టత లేదని తెలుస్తోంది. అయితే, అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని పోలీసులను అప్రమత్తం చేయడంతో పోలీసు ఉన్నతాధికారులే స్వయంగా కృపామణి కేసు దర్యాప్తును చేపట్టారు. ఆ తర్వాత ఈ కేసులో ఒక్కొక్కరుగా అరెస్టు చేస్తూ వచ్చారు. తాజాగా మంగ అలియాస్ బుజ్జమ్మను అదుపులోకి తీసుకున్నారు. కృపామణి తండ్రి రామలింగేశ్వరరావును దెందులూరులో, తల్లి లక్ష్మి, సోదరుడు రాజ్ కుమార్‌ను దెందులూరు మండలం, చిల్లచింతలపూడిలో గతంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారి టోల్ గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే గుడాల సాయిశ్రీనివాస్ విశాఖలోనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.