గాంధీ జపం తప్ప ఆచరలో మోడీ సర్కార్‌ విఫలం

– నిజాం సొమ్ములో ఔరంగాబాద్‌ నీటి కష్టాలు తీర్చాలి
– ఎన్నికల ప్రచారంలో మండిపడ్డ ఓవైసీ
ఔరంగబాద్‌,అక్టోబర్‌ 3 (జనంసాక్షి):ప్రస్తుత ఎన్డీఏ సర్కారు.. మనసులో గాడ్సేని పెట్టుకుని, పెదాల చివరి నుంచి గాంధీ గురించి మాట్లాడుతోందని  హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. మహాత్ముడిని హత్య చేసిన గాడ్సేనే వాళ్లు హీరోలా ఆరాధిస్తున్నారన్నారు. గాడ్సే నాడు గాంధీజీని మూడు బుల్లెట్లతో చంపితే.. నేటి పాలకులు ప్రతి రోజూ ప్రజల్ని చంపుతున్నారంటూ ఆవేశంగా మాట్లాడరు. మహాత్మ గాంధీ జయంతి నాడు హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ.. మోడీ సర్కార్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో 28 స్థానాల నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం తన ప్రచారంలో భాగంగా ఔరంగబాద్‌ లో బుధవారం రాత్రి సభ నిర్వహించింది. ఈ సందర్భంగా అసదుద్దీన్‌ ఒవైసీ ఆవేశంగా ప్రసంగించారు. బీజేపీ నేతలు గాంధీజీ పేరు చెప్పుకొంటూ తమ దుకాణం  నడుపుకొస్తున్నారని ఒవైసీ అన్నారు. దేశ ప్రజల్ని ఆ మహాత్ముడి పేరు చెప్పి మాయ చేస్తున్నారని ఆరోపించారు. మహాత్మ గాంధీ అహింసా సిద్దాంతాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలన్నారు. రైతుల కోసం గాంధీజీ స్వాతంత్య పోరాట సమయంలోనే ఉద్యమించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చివరి నిజాం విూర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఆస్తుల కేసులో 70 ఏళ్ల పోరాటంలో పాక్‌ పై భారత్‌ విజయం సాధించిందని, లండన్‌ కోర్టు దాదాపు 450 కోట్లు భారత్‌ కు చెందుతాయని తీర్పు ఇచ్చిందని అన్నారు. ఈ సొమ్ములో కొంత భాగం నిజాం వారసులకు పోతుందని, మిగిలిన దాన్ని ఔరంగబాద్‌ ప్రజల తాగు నీటి కష్టాలు తీర్చడానికి వాడాలని కోరారాయన.

తాజావార్తలు