నూతన మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

– నవంబర్‌ 1 నుంచి కొత్త విధానం అమలులోకి
– కనిష్ట లైసెన్స్‌ ఫీజు 50 లక్షలు..గరిష్టంగా కోటి 20 లక్షలు
– జిమెచ్‌ఎంసి పరిధిలో ఉదయం 10నుంచి రాత్రి 11 గంటల వరకు దుకాణాలు
– గ్రామాల్లో 10 నుంచి రాత్రి పది వరకు అనుమతులు
– లైసెన్స్‌ దరఖాస్తుకు రూ.2 లక్షల ఫీజు నిర్ణయం
హైదరాబాద్‌,అక్టోబర్‌ 3 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. నూతన మద్యం విధానానికి సంబంధించి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబర్‌ ఒకటి నుంచి కొత్త మద్యం విధానం అమలులోకి రానుంది. ఇప్పటికే ఓ నెల పాటు మద్యం దుకాణాలకు గడువు పెంచింది. అక్టోబర్‌ 1 నుంచే కొత్త మద్యం విదానం అమల్లోకి రావాల్సిఉన్నా నెల ఆలస్యంగా ఈ విదానం అమలు కానుంది. కొత్త విధానంలో కూడా జనాభా ప్రాతిపదికన లైసెన్స్‌ ఫీజులు ఖరారు చేయనుంది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా ప్రభుత్వం మార్చింది. 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షల లైసెన్స్‌ ఫీజు. 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు.. 50 వేల నుంచి లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షలు.. లక్ష జనాభా నుంచి 5 లక్షల లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు..5 లక్షల నుంచి 20 లక్షలలోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు.. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్ల లైసెన్స్‌ ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాల కోసం నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2,216 దుకాణాలకు లాటరీ పద్ధతిన దుకాణదారులను ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మద్యం షాపులు తెరచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.  నవంబర్‌ 1, 2019 నుంచి అక్టోబర్‌ 31, 2021 వరకు కొత్త మద్యం విధానం అమల్లో ఉండనుంది. ఈ సారి జనాభా ప్రాతిపదికన లైసెన్స్‌ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా మార్చింది.

తాజావార్తలు