పెన్షన్ పునరుద్దరణ కోరుతూ 28న చలో విజయవాడ
విశాఖపట్టణం,ఏప్రిల్5(జనంసాక్షి): కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్) రద్దు చేయాలనే ప్రధాన డిమాండుతో ఈ నెల 28న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీఎస్ ఉపాధ్యాయ పోరాట సమితి , పీఆర్టీయూ జిల్లానాయక్తం నేతలు పేర్కొన్నారు. 28న చలో విజయవాడ పేరిట వేలాది మంది ఉపాధ్యాయ, ఉద్యోగులతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఛలో విజయవాడ కార్యక్రమంలో సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులతో పాటు సంఘీభావం తెలియజేసే వారంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ముఖ్యఅతిథిగా ఆహ్వానించామన్నారు. ఈ సదస్సులో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు నాయకత్వంలో ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని అందజేసి, స్పష్టమైన హావిూని పొందడానికి చర్యలు ప్రారంభించామన్నారు. దీనికి విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడులతో సహా పలువురు మంత్రులు, అధికారులు సహకరిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1 నుంచి పాత పింఛను విధానాన్ని రద్దు చేసిన ఈ సీపీఎస్ పింఛను విధానాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.50 లక్షల మంది అధికార, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు సీపీఎస్ పింఛను విధానంలో ఉన్నారన్నారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ 66 మంది ఉపాధ్యాయులు మరణించగా.. వారి కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక ఆసరా, పింఛను లేకుండా నడిరోడ్డున పడ్డారన్నారు. ఈ విధానంపై దేశ వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు ప్రారంభమయ్యాయన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగుల పోరాటానికి స్పందించి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులతో ఉత్తర్వుల సంఖ్య 65 ప్రకారం ఫిబ్రవరి 26న పింఛను విధానాన్ని సవిూక్షించడానికి కమిటీ వేసిందన్నారు. రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని రద్దు చేయించి, పాత పింఛను విధానాన్ని కొనసాగించడానికి ఉద్యమాన్ని తీవ్రతరం చేశామన్నారు.సీపీఎస్ పింఛను విధానంతో ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి భద్రత, భరోసా ఉండదన్నారు. ఈ విధానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రద్దు చేసి రాష్ట్రంలోని 1.50 లక్షల కుటుంబాల భవిష్యత్తుకు భరోసా, భద్రత ఇస్తారని ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.