రేపు ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ
‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ ఉద్యమించి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్న ఘన చరిత్ర విశాఖపట్నం సొంతం. ఇప్పుడు అదే నగరంలో ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రాభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించనున్నారు.
విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే జై ఆంధ్రప్రదేశ్ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇది ఐదు కోట్లమంది ఉద్యమం
రాజధానిలో ఉద్యోగాలను దూరం చేసిన ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా 1972లో రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో యువత ప్రత్యేక రాష్ర్టం కోసం ‘జై ఆంధ్ర’ నినాదంతో మహోద్యమం సాగించిన సంగతి తెల్సిందే. నేడు సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా లభించిన ‘ప్రత్యేక హోదా’ను పాలకులు నిరాకరించడం, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలను దూరం చేయడానికి నిరసనగా ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో జగన్‌మోహన్ రెడ్డి ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ‘యువభేరి’ సదస్సులతో యువతను చైతన్యపరుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఇపుడు ప్రత్యేక హోదా సాధన కోసం ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇపుడు ఈ ఉద్యమం ఐదు కోట్ల మంది ఆంధ్రుల చేతుల్లోకి వెళ్లింది.