ర్యాంకుల కోసం ఒత్తిళ్లకు గురిచేస్తే చర్యలు తప్పవు

– నిబంధనలు అతిక్రమిస్తే కొరడా తప్పదు

– రాష్ట్రంలో 194 కార్పొరేట్‌ కాలేజీలకు నోటీసులిచ్చాం

– వచ్చే విద్యాసంవత్సరం మార్చిలోపే గుర్తింపు కళాశాల జాబితా ప్రకటిస్తాం

– అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టీకరణ

హైదరాబాద్‌,నవంబర్‌ 10,(జనంసాక్షి): నిబంధనలు పాటించని కార్పొరేట్‌ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ, శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే ర్యాంకుల పేరిట విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్న194 కార్పొరేట్‌ కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వీటిపై ఈ విద్యాసంవత్సరంలోనే చర్యలు తీసుకొనేందుకు సిద్ధమయ్యామని, కానీ ప్రస్తుతం విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్టపోవద్దనే ఆలోచనతో కాలేజీల అనుమతులు రద్దు చేయలేదని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అనుమతులకు పకడ్బందీ విధానం అములచేస్తామన్నారు. అనమతులు లేని కళాశాలల జాబితాపేర్లను వచ్చే విద్యాసంవత్సరం మార్చిలోనే పత్రికల్లో ప్రకటన ద్వారా ప్రకటిస్తామన్నారు. ముందస్తు ప్రవేశాలు జరిపే ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని, మార్చి 31, 2018లోపు కాలేజీల అఫిలియేషన్‌ పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కళాశాల అనుమతి తీసుకున్న సమయంలో హాస్టల్‌కు అనుమతి తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రైవేట్‌ కళాశాలల ప్రవర్తన వల్ల పిల్లలు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రైవేట్‌ కళాశాలలు అన్ని గత ప్రభుత్వాలే మంజూరు చేశాయన్నారు. కొన్ని ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు కళాశాలలు నడపడం కోసం అనుమతులు తీసుకొని హాస్టళ్లు కూడా నడుపుతున్నాయన్నారు. దీనిని ప్రభుత్వం గుర్తించి హాస్టళ్లకు కూడా అనుమతులు తీసుకోవడం తప్పనిసరి చేస్తున్నామన్నారు. జూనియర్‌, డిగ్రీ కళాశాలలు అవసరానికి మించి ఉన్నాయని.. వాటిని రెగ్యులేట్‌ చేస్తామని చెప్పారు. మరో మూడు నెలల సమయంలో చర్యలు తీసుకోకపోతే అప్పుడు మమ్ములను అడగవచ్చన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి10 గంటల వరకు ఊపిరి సలపని రీతిలో స్టడీ అవర్స్‌, సెలవుల్లో కూడా తరగతుల నిర్వహణ, హాస్టళ్లలో సరైన వసతులు లేకపోవడం, విద్యార్థుల పై తీవ్రమైన ఒత్తిడి అనే అంశాలు ఆత్మహత్యలకు దారి తీస్తున్నట్లు ఇటీవల ఇంటర్‌ బోర్డు ఆధ్వర్యంలో చేసిన తనిఖీల్లో వెల్లడైంది. విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు కాలేజి యాజమాన్యాలు, తల్లిదండ్రులతో ప్రభుత్వం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి నిబంధనలు అతిక్రమించిన కళాశాలలపై క్రిమినల్‌ చర్యలకు కూడా ప్రభుత్వం వెనకడుగు వెయ్యదని సభలో మంత్రి స్పష్టం చేశారు.

 

 

తాజావార్తలు