వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం రద్దు

 

– కేంద్ర హెంశాఖ సంచలన నిర్ణయం

వేములవాడ,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి): వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు సంబంధించిన భారత పౌరసత్వం చెల్లనేరదని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ ధృవీకరించింది. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీలో నివాసముంటున్నాడని, భారత పౌరసత్వాన్ని పొందాలంటే సంవత్సరం పాటు (365 రోజులు) క్రమం తప్పకుండా భారత దేశంలో నివసించి తీరాలన్న పౌరసత్వ చట్టం నిబంధనలను రమేశ్‌బాబు ఉల్లంఘించాడని, ఎమ్మెల్యే 96 రోజులకు మించి ఎప్పుడు కూడా భారత్‌లో నివసించలేదని పేర్కొంటూ బిజెపి నాయకులు ఆది శ్రీనివాస్‌ గతంలో హైకోర్టులో పిటీషన్‌ ధాఖలు చేశారు. కాగా ఈ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు ఎమ్మెల్యే పౌరసత్వం చెల్లదని 2013లో తీర్పు వెలువరించడంతో హతాశుడైన రమేశ్‌బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆది శ్రీనివాస్‌ కూడా సుప్రీం కోర్టులో తిరిగి పిటీషన్‌ వేయడం, దీనికి సంబంధించి 2016 ఆగస్టులో తమముందుకు వచ్చిన ఈ పిటీషన్‌పై స్పందించిన కోర్టు ధర్మాసనం ఎమ్మెల్యే పౌరసత్వాన్ని ధృవీకరించాల్సింది కేంద్ర హోంశాఖేనని స్పష్టం చేసింది. అయితే దీనిపై విచారణకు తమకు గడువు కావాలన్న హోంశాఖ విజ్ఞప్తి మేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు పూర్తికాగా ఎమ్మెల్యే పౌరసత్వం తేల్చకపోవడంతో ఈ గడువును మరో 3 నెలల పాటు పొడిగించింది. కాగా ఎమ్మెల్యే లేవనెత్తిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు, నిబంధనల ప్రకారం పౌరసత్వాన్ని తేల్చాల్సింది హోంశాఖేనని పేర్కొంటూనే దీనిని ఆరు వారాల్లోగా స్పష్టం చేయాలని గత వారం రోజుల క్రితం ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వం చెల్లనేరదని, తాజాగా కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ప్రకటించడంతో మంగళవారం వేములవాడ టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల్లో ఒక్కసారిగా నిరాశా, నిస్పృహలు ఆవరించాయి.

 

 

 

 

 

 

 

 

 

తాజావార్తలు