తుగ్లక్ చర్యకు తోటలు బుగ్గి మాడుగులపల్లి సరిహద్దుల్లో దుండగుల ఘాతుకం

 

 

 

 

 

 

వరి కొయ్యల దహనంతో ఎగసిపడిన మంటలు 10 ఎకరాల్లో బీభత్సం

రైతు గడ్డం మాధవరెడ్డికి రూ. 1.50 లక్షల వరకు నష్టం

మాధవరెడ్డి, వెంకట్‌రెడ్డి, వెంకన్న బత్తాయి తోటలు మాడి మసి

ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం
ప్రాణాలు పణంగా పెట్టి గ్రామాన్ని కాపాడుకున్న రైతులు

మాడుగులపల్లి, మే 22 (జనం సాక్షి):

అమాయక రైతుల శ్రమకు గుర్తు తెలియని దుండగుల నిర్లక్ష్యం తోడైతే ఎలాంటి విపత్తు సంభవిస్తుందో నిదర్శనంగా నిలిచింది ఇందుగుల రోడ్డు ప్రమాదం వరి కొయ్యలను తగలబెట్టే క్రమంలో కొందరు చేసిన తుగ్లక్ పని పక్కనే ఉన్న బత్తాయి తోటలను బుగ్గిపాలు చేసింది
దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో మంటలు రాకాసిలా ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా క్షణాల్లో రణరంగంగా మారింది
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాడుగులపల్లి మండలం సరిహద్దుల్లోని ఇందుగుల రోడ్డు పక్కన ఉన్న వరి పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా నిప్పు పెట్టారు ఎండ తీవ్రతకు మంటలు క్షణాల్లో వ్యాపించి, పక్కనే ఉన్న రైతులు గడ్డం మాధవ రెడ్డి, వెంకట్ రెడ్డిలకు చెందిన బత్తాయి తోటలపైకి దూసుకెళ్లాయి చూస్తుండగానే అగ్నికీలలు తోటను చుట్టుముట్టడంతో, ఒక లైన్ మొత్తం బత్తాయి చెట్లు నిలువునా మాడిపోయి ఎండిపోయాయి ఈ ప్రమాదంలో తనకు సుమారు రూ. 1,50,000 (లక్షా యాభై వేల) వరకు భారీ నష్టం వాటిల్లిందని బాధితుడు గడ్డం మాధవరెడ్డి కన్నీరుమున్నీరవుతున్నారు ఎన్నో ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న తోట కళ్లముందే బూడిదవుతుంటే రైతులు గుండె లబోదిబోమన్నారు ఇందుగుల గ్రామానికి చెందిన మరో రైతు కొమ్ము వెంకన్న పొలంలో పైపులన్నీ కాలిపోవడంతో ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
ఇంత పెద్ద ప్రమాదం జరుగుతున్నా, సమాచారం అందించినప్పటికీ అగ్నిమాపక (ఫైర్) సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ వ్యవస్థలు చేతులెత్తేసిన వేళ, రైతులు ప్రాణాలకు తెగించి రంగంలోకి దిగారు తోటలోని బోరు బావుల నుంచి నీటిని పైపుల ద్వారా పారించి, శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు రైతులు గనుక సకాలంలో సాహసం చేయకపోతే, మంటలు పక్కనే ఉన్న గ్రామానికి వ్యాపించి పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించి ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు
బత్తాయి తోటను ఆనుకొని ఉన్న వరి పంట భూముల్లో కావాలనే వరి కొయ్యలకు మంటలు పెట్టడం వెనుక ఉన్నదెవరు? అనే కోణంలో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రతి ఏటా వరి కొయ్యలు తగలబెట్టవద్దని హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైందనడానికి ఈ ఘటనే నిదర్శనం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఈ అగ్ని ప్రమాదానికి కారణమైన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే నిలువునా నష్టపోయి రోడ్డున పడ్డ గడ్డం మాధవరెడ్డితో పాటు మిగిలిన బత్తాయి రైతులకు తక్షణమే ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.

తాజావార్తలు