అక్రమ ఇసుక రవాణా విషయాన్ని బయటపెట్టిందనే కక్షతో మహిళపై దాడి యత్నం
పర్వతగిరి మే 21: (జనం సాక్షి): పర్వతగిరి మండలం అన్నారం దూషితాండ గ్రామంలో ఓ మహిళపై దాడి యత్నం జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన బానోతు యాకమ్మ (65) తెలిపిన వివరాల ప్రకారం, ఆమె మరిది కొడుకు నవీన్, అతని తండ్రి పుల్ సింగ్, తల్లి బుబ్బు మరియు మరికొందరు కలిసి గురువారం ఉదయం ఆమె ఇంటి వద్దకు వచ్చి అనవసరంగా గొడవకు దిగినట్లు ఆరోపించారు.అక్రమ ఇసుక రవాణా విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకే తనపై కక్ష పెంచుకుని దాడికి యత్నించారని యాకమ్మ ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. ఇంటి బయట నిలబడి బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఆమె పేర్కొన్నారు.ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.



