ఎన్నికల సందర్భంగా మద్యం షాపుల మూసివేత

కామారెడ్డి,జనవరి19(జ‌నంసాక్షి): మూడు విడతల్లో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా మండలాల్లో పోలింగ్‌ రోజు కౌంటింగ్‌ ముగిసే వరకు మద్యం షాపులు, తాడీ డిపోలు, ఐఎంఎల్‌ షాపులు, బార్లు మూసి ఉంచాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 21న మొదటి విడతలో భిక్కనూరు, రాజంపేట్‌, దోమకొండ, బీబీపేట్‌, కామారెడ్డి, (కామారెడ్డి మున్సిపాలిటీ మినహా), మాచారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్‌, రామారెడ్డి మండలాలో ఈ నెల 19న సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్‌ ముగిసే వరకు మద్యం షాప్‌లు మూసి ఉంచాలని సూచించారు. రెండో దశ ఎన్నికలు 25న గాంధారి, లింగంపేట్‌, నాగిరెడ్డిపేట్‌, ఎల్లారెడ్డి (ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మినహా), నిజాంసాగర్‌, పిట్లం మండలాల్లో ఈ నెల 23న సాయంత్రం 5 నుంచి కౌంటింగ్‌ ముగిసే వరకు, మూడో దశ ఎన్నికలు 30న బిచ్కుంద, పెద్దకొడప్‌గల్‌, జుక్కల్‌, మద్నూర్‌, బాన్సువాడ (బాన్సువాడ మున్సిపాలిటీ మినహా), బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల్లో 28న సాయంత్రం 5 నుంచి కౌంటింగ్‌ ముగిసే వరకు మద్యం షాపులు మూసివేయాలని సూచించారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో జిల్లాలో మొదటి, రెండో విడతతో పాటు మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్‌ మేరకు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్నామని, మొదటి, రెండో విడతల నామినేషన్‌ పత్రాల స్వీకరణ పూర్తయిందని తెలిపారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 164 గ్రామ పంచాయతీలకు, 1,508 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా… 31 పంచాయతీలు, 452 వార్డులు ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు. రెండో విడతలో 192 పంచాయతీలకు గాను 1,622 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా… 35 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మూడో విడతలో 170 పంచాయతీలకు, 1512 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయని వివరించారు.