కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: డిసిసి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): కోటి ఆశలతో ఆవిర్భవించిన కొత్త రాష్ట్రం నలుగురు కుటుంబ సభ్యుల దోపిడీ ప్రభుత్వంగా మారిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన హుదాన్‌ అన్నారు. సంపన్న రాష్ట్రాన్ని దివాళా తీయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగ నంపే విధంగా ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లన్నింటిలోనూ టెండర్లు అడ్డగోలుగా పెంచేసి వాటిలో పెద్ద మొత్తంలో కవిూషన్‌ పొందుతున్నారని ఆరోపించారు. దళితులు, బలహీన, అణగారిన వర్గాలంటే కేసీఆర్‌కు గిట్టదని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం అడుగడుగునా అణగారిన వర్గాలను మోసం చేస్తోందని అన్నారు. రైతులకు ఏక కాలంలో రుణాలు మాఫీ చేయకపోవడంతో పరిస్థితి దయనీ యంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదలకు రెండు పడకల ఇళ్లు వంటి పథకాలు ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. తెలంగాణ వచ్చినందుకు గర్వంగా ఉన్నా.. తెరాస పాలన తీసికట్టుగా మారిందని ధ్వజమెత్తారు. మిషన్‌కాకతీయలో అవినీతి చోటు చేసుకుందని విజిలెన్సు విభాగం కేసులు నమోదు చేసినా చర్యలు లేవన్నారు. ఎస్సీ ఉపప్రణాళిక నిధులు పక్కదారి పట్టించారని విమర్శించారు.