కృష్ణా పరివాహకంలో మళ్లీ పెరిగిన వరద

జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు వరద ప్రవాహం
నిండుకుండల్లా ప్రధాన జలాశయాలు
మహబూబ్‌నగర్‌,అగస్టు9(జనంసాక్షి): కృష్ణా పరివాహకంలో మళ్లీ వరద పెరిగింది. దీంతో ప్రధాన జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు వరద కొనసాగుతోంది. క్రమంగా తగ్గినట్లే తగ్గిన వరద జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నది. ఎగువ నుంచి జూరాలకు 88,300 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో 12 గేట్లు ఎత్తి 84,739 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 విూటర్లు కాగా.. ప్రస్తుతం 317.740 విూటర్ల వద్ద నీరు ఉన్నది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. 8.087 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కాగా, శ్రీశైలం వైపు 81,401 క్యూసెక్కుల నీరు వెళ్తున్నది. జూరాల నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,27,417 క్యూసెక్కులన నీరు వచ్చి చేరుతున్నది. అధికారులు 62,076 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.10 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 215.807 టీఎంసీలకుగాను 210.5133 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. మరోవైపు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నది. ఎగువనుంచి వరద ప్రవాహం తగ్గినప్పటికీ జలాశయం ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌లోకి 73,048
క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతే మొత్తంలో నదిలోకి వదిలేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.90 అడుగులు నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 312.0450 టీఎంసీలు. ఇప్పుడు 311.7462 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎడమ కాలువ ద్వారా 7518 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.