ఖండాంతరాలు దాటిన బతుకమ్మ పండుగ ఖ్యాతి

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, సెప్టెంబర్ 22 : తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలకు చేరిందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసన మండలి సభ్యులు కల్వకుంట్ల కవిత హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. కమ్మర్ పల్లి మండలం లలిత గార్డెన్స్ లో దసరా కానుకగా ప్రభుత్వం తరఫున మహిళలకు శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథులుగా విచ్చేసిలాంఛనంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇదివరకు బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత సన్నగిల్లిన తరుణంలో ఎమ్మెల్సీ కవిత కొనసాగించిన కృషితో బతుకమ్మ వేడుకల ఖ్యాతి ఖండతరాలు దాటిందని కొనియాడారు. కవిత కృషి వల్లే నేడు దేశ విదేశాల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని అన్నారు. తెలంగాణలోని ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో ఈ వేడుక జరుపుకోవాలనే ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్టీ పండుగగా ప్రకటించి ప్రతి ఏటా కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తోందని గుర్తు చేశారు. ప్రతి తెలంగాణ బిడ్డ ముఖంపై చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు.
దేశంలోనే మరెక్కడా లేనివిధంగా అన్ని వర్గాల వారి కోసం సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. ఇంటింటికి వచ్చి ట్రాక్టర్ ట్రాలీల ద్వారా చెత్త సేకరణ, ఇంటింటికి నల్లా కనెక్షన్లు అమర్చి గోదావరి జలాలను అందిస్తున్నామని, ప్రతి గ్రామ పంచాయతీ వైకుంఠదామాలు నిర్మించామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధిని సంతరించుకుంటున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జాతీయ స్థాయిలో ప్రకటించిన అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి 13 అవార్డులు దక్కడం రాష్ట్ర ప్రభుత్వ దార్శనిక పాలనకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 800 జిల్లాలు ఉండగా, తెలంగాణలోని మన నిజామాబాద్ జిల్లా 3వ స్థానంలో నిలిచిందని అన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 22 లక్షల మందికి నెలకు 200 రూపాయలు మాత్రమే పెన్షన్లు అందేవని, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం వాటి సంఖ్య 48 లక్షలకు పెరిగిందని, పెన్షన్ మొత్తాన్ని 200 రూపాయల నుండి 2016 రూపాయలకు పెంచడం జరిగిందని, వికలాంగులకు 3016 రూపాయలు అందిస్తున్నామని గుర్తు చేశారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా బీడీ కార్మికులకు తెలంగాణలో పెన్షన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు. 6 కోట్ల పైచిలుకు జనాభా కలిగిన గుజరాత్ రాష్ట్రంలో కేవలం 13 లక్షల మందికి నెలకు కేవలం వంద కోట్ల రూపాయల వరకే పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు. వృద్దులకు 750 రూపాయలు, ఒంటరి మహిళలకు 950 , వికలాంగులకైతే కేవలం 600 రూపాయల చొప్పున మాత్రమే గుజరాత్లో పెన్షన్ల పంపిణీ జరుగుతోందన్నారు. అందుకు భిన్నంగా కేవలం 3 .80 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 48 లక్షల మందికి నెలకు 12 వేల కోట్ల రూపాయల చొప్పున పెన్షన్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 23 కోట్ల జనాభా ఉంటే, కేవలం 80 లక్షల మందికి నెలకు 500 రూపాయల చొప్పున మాత్రమే పెన్షన్ల కింద అందిస్తున్నారని అన్నారు. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉందన్నారు. తెలంగాణ లో ప్రభుత్వం పెద్ద ఎత్తున పెన్షన్ల రూపేణా ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుండగా, పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో ప్రజలు ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పేవన్నీ ముమ్మాటికీ వాస్తవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పాలనకు మద్దతుగా నిలువాలని కోరారు.