ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలి

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

జగిత్యాల,నవంబర్‌25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. రైతులు ధాన్యం కేంద్రాలకు తెచ్చేటప్పడు ఇంటి వద్దే ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా దాన్యం కొనుగోళ్లు జరపాలని నిర్వహకులకు సూచించారు. రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కేంద్రాల్లో అందరూ స మన్వయంతో సహకరించుకుంటూ ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరిగేలా చూడాలని కోరారు. రైతుల సంక్షేమమే ద్యేయగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని పేర్కొన్నారు. నీటి లభ్యత పెరగడం, 24 గంటల కరెంట్‌ సరఫరాతో జిల్లాలో పంట దిగుబడులు పెరిగాయన్నారు. రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. గతంలో 270 మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఉండగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటి వరుకు 278 సెంటర్లను ప్రారంభించుకున్నామన్నారు. గన్నీ సంచుల ఇబ్బందులు ఉండవద్దనీ ముందుగానే మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో ఇప్పటికే కోటి సంచులు తెప్పించామన్నారు. ఇంక 40లక్షలు తెప్పిస్తామన్నారు. ప్రభుత్వం చివరి గింజవరకు కొనుగోలు చేస్తామని అధికారులకు ఆదేశాలు ఇచ్చిందన్నారు. గత పాలకులు ఎన్ని గోదాంలు నిర్మించారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని గోదాంలను నిర్మించుకున్నామన్నారు. అలాగే ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నదని కొనియాడారు.