నేడు ఖమ్మంలో రైతు సమన్వయ సమితి సమావేశం

ఖమ్మం,జూన్‌18(జ‌నం సాక్షి): ఈనెల 19న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన రైతు సమన్వయ సమితి సమావేశం ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ గాడ్డెన్‌లో జరగనుంది. ప్రభుత్వం ఆగష్టు 15న ప్రారంభించే రైతు బీమా పథకానికి సంబంధించి అవగాహన కల్పించేందుకు గాను ఈసమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్య అతిథులుగా మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు హాజరుకానున్నారు. ఉదయంప్రారంభమయ్యే ఈసదస్సుకు రెండు జిల్లాల కన్వీనర్లు, కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు, కమిటీ సభ్యులు, గ్రామ కన్వీనర్లతో పాటు, జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ వ్యవసాయశాఖ అధికారులు సైతం హాజరుకానున్నారు. గత వారం రోజుల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతు బీమా పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఏఈఓలు సేకరిస్తున్నారు. అయితే ఈ పథకంవిజయవంతంలో రైతు సమన్వయ సమితుల సభ్యులకు ఈసదస్సులో మంత్రులు దిశానిర్ధేశర చేయనున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం నేటి వరకు రైతు బీమా పథకం ప్రవేశపెట్టిన దాఖాలాలు లేవు. సీఎం కేసీఆర్‌ స్వయంగా ఈ పథకానికి రూపకల్పన చేసి అమలు చేయబోతున్న తరుణంలో విజయవంతం చేసేందుకుగాను ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 2,500మంది హాజరయ్యే ఈ సదస్సు విజయవంతం కోసం జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.