ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది

నిజామాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): మిషన్‌ కాకతీయతో చెరువుల్లో నీరు చేరడంతో పాటు ప్రభుత్వప్రోత్సాహం కారణంగా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని మత్స్యకార సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో తాము ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. గతంలో 50 శాతం రాయితీతో చేప పిల్లలను పంపిణీ చేయగా.. తాజాగా ప్రభుత్వం వందశాతం రాయితీతో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో తమకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. చెరువుల్లో నీరు ఉండడం కూడా తమకు కలసి వస్తోందని అన్నారు. చేప పిల్లల పంపిణీతో పాటు మార్కెట్‌సౌకర్యం సైతం కల్పించడంతో చేతినిండా పని దొరుకుతుందని వివరించారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించాయని.. కెసిఆర్‌ ప్రభుత్వం తమ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణిస్తే గ్రూపు ఇన్సురెన్సు కింద అందజేసే పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షలను పెంచుతూ తమ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.