ప్రాజెక్టులకు జలకళ

భద్రాద్రి కొత్తగూడెం,జూలై18(జ‌నం సాక్షి): ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంత రింపజేసుకున్నాయి. సోమవారం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు కురిశాయి. తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరడంతో 17 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. పెరుగుతూ, తగ్గుతూ ఉన్న గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద 27.1 అడుగులకు చేరుకుంది. పరిస్థితిని బట్టి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు నీటి మట్టం 404.8 అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 5 వేల క్యూసెక్కులు కావడంతో ఒక గేటు ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కిన్నెరసాని ఎగువ ప్రాంతాల్లోని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.