మార్కెట్‌ దోపిడీకి పడని అడ్డుకట్ట

చూసీచూడనట్లుగా అధికారుల తీరు

మహబూబ్‌నగర్‌,మే25(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంటే రైతులు ఏటా కోట్లల్లో నష్టపోతున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు రైతు తెచ్చిన ధాన్యాన్ని కవిూషన్‌ ఏజంటు ద్వారా వ్యాపారులు కోనుగోలు చేస్తుంటారు. టెండరు పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేశాక బస్తా తూకం వేయటం కోసం దడవాయిలకు ముట్టచెప్పుకోవాల్సి వస్తోంది. రైతుల సంక్షేమమే ధ్యేయమని కొలువుదీరిన మార్కెట్‌ పాలకవర్గాలు వారి కళ్లెదుటే రైతులు దగాకు గురవుతున్నా పట్టించుకోవటం లేదు. కవిూషన్‌ ఏజంట్లు దడవాయి ఛార్జీలను రైతులతోనే కట్టించుకంటూ నిలువు దోపిడీ చేస్తున్నారు.అయితే నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేయటంపై రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌ అధికారులు చెప్పి తప్పించుకుంటున్నారు. ప్రతి బస్తా తూకం వేసినందుకు రైతుకు ఇచ్చే సొమ్ములో రూ. 3.30 కోత విధించి దడవాయిలకు ఇస్తున్నారు. ఇదేమని అడిగిన రైతులకు అసలు తక్‌పట్టే ఇవ్వకుండా తెల్లకాగితం విూద రాసి చేతిలో పెట్టి పంపిస్తున్నారు. మార్కెటింగ్‌ అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొనుగోలుదారులే దడవాయి ఛార్జీలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అమలు కావడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 17 వ్యవసాయ మార్కెట్లలో అధికారులు ఈ నిబంధనను పట్టించుకోవడం లేదు. గద్వాల, జడ్చర్ల, పాలమూరు, నారాయణపేట, కోస్గి, పెబ్బేరు, మదనాపురం, నాగర్‌కర్నూలు తదితరాలతోపాటు మొత్తం 17 వ్యవసాయ మార్కెటు యార్డులు ఉన్నాయి. ప్రతి రోజు ఒక్కో మార్కెట్‌ యార్డుకు సీజన్‌లో 5వేల నుంచి 6వేల బస్తాల వరకు వరి, ఆముదం, వేరుసెనగ, ఇతర పప్పు ధాన్యాలు వస్తుంటాయి. జిల్లాలోని మొత్తం మార్కెటు యార్డుల పరిధిలో రోజుకు సగటున 50వేల బస్తాల వరకు రైతులు వివిధ పంటలను అమ్ముతున్నారు. ఈ లెక్కన ఏటా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు దడవాయి ఛార్జీల రూపంలో కోట్ల వరకు నష్టపోతున్నారు. వాటిని అమలు చేయకుండా వ్యాపార వర్గాలకు కొమ్ము కాస్తున్నారు. ఫలితంగా రెక్కల కష్టమైన పంటను అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతలే దడవాయి ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. వ్యాపారులే దడవాయి ఛార్జీలు చెల్లించాలన్న నిబంధన ఉన్నా దాన్ని అమలుచేయకపోవటంతో రైతులు నష్టపోతున్నారు. కొనుగోలుదారులు, కవిూషన్‌ దారులు, అధికారులు కుమ్ముక్కై అమలు చేయటం లేదు. ప్రభుత్వం రైతుల మేలు కోసం చేసిన నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా మార్కెటు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.