రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ గెలుపు

జింబాబ్వేతో సిరీస్‌ సమం
హరారే, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి):
జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ విక్టరీ కొట్టింది. 143 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. భారీ లక్ష్య ఛేదనలో 4 వికెట్లకు 139 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే  క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవ్వరూ క్రీజులో నిలవలేకపోయారు. అయితే టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మసకద్జ ఒంటరి పోరాటం చేశాడు. పట్టుదలగా ఆడుతూ మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు ప్రయత్నించాడు. టెయిలెండర్ల నుండి లభించిన సపోర్ట్‌తో మెల్లిగా స్కోర్‌ 250 దాటించాడు. ఈ క్రమంలో సెంచరీ కూడా పూర్తి చేసుకున్న మసకద్జా ఆఖరి వికెట్‌కు జర్విస్‌తో కలిసి 38 పరుగులు జోడించాడు. అయితే టీ బ్రేక్‌ తర్వాత బంగ్లా బౌలర్లు విజృంభించి జింబాబ్వే ఇన్నింగ్స్‌ను ముగించారు. దీంతో జింబాబ్వే ఇన్నింగ్స్‌కు 257 పరుగుల దగ్గర తెరపడింది.బంగ్లా బౌలర్లలో రహమాన్‌ 4 , షకీబుల్‌ హసన్‌ 3 వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమంగా ముగిసింది. ముష్ఫికర్‌ రహీమ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ , రొబుల్‌ ఇస్లాంకు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు లభించాయి.