రైతుబంధు పథకంతో.. 

కేసీఆర్‌ ఆత్మబంధవు అయ్యారు
– ఉమ్మడి పాలనలో రైతులను గాలికొదిలేశారు
– విత్తనాలు, ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది
– తెరాస హయాంలో ఆపరిస్థితిని తరిమేశాం
– తెలంగాణలో రైతురాజ్యం నడుస్తుంది
– చెక్కుల పంపిణీతో రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తుంది
– రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌
– ఇల్లంతకుంటలో రైతుబంధు చెక్కుల పంపిణీ చేసిన మంత్రి
రాజన్న సిరిసిల్ల, మే16(జ‌నం సాక్షి) : రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆత్మబంధవుగా మారారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఇల్లంతకుంట మండలంలో రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రైతులను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. రుణిమాఫీ, ఉచిత విద్యుత్‌, సరైన సమయంలో విత్తనాలు-ఎరువులు అందజేస్తూ.. ఇప్పుడు పెట్టుబడి సాయం అందించి రైతులకు అండగా ఉంటున్నామని మంత్రి పేర్కొన్నారు. జూన్‌ 2నుంచి రైతుబీమా పథకం అమలుచేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ నాయకులు ఏనాడు రైతులను పట్టించుకోలేదని, ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెబుతూ రైతులపై కపట ప్రేమను ప్రదర్శించడం విడ్డూరంగా ఉందని కేటీఆర్‌ విమర్శించారు.పంట పెట్టుబడి రూ.4 వేలు చాలదు అంటూ మాట్లాడుతున్న జానారెడ్డి, అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మ్యానిఫెస్టో గురించి
మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పాలనలో 9గంటల కరెంట్‌ ఇస్తామని చెప్పి కనీసం వరుసగా 4 గంటలు కరెంట్‌ ఇయ్యలేని దుస్థితిని రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారని గుర్తు చేశారు. గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి రారని, గడ్డాలు పెంచుకున్నోలందరూ గబ్బర్‌ సింగ్‌లు కారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నాయకుడు ఏ మంచి పని చేసిన కోడి గుడ్డు విూద ఈకలు లెక్క పెట్టే పనిచేస్తున్నారని మండిపడ్డారు. కౌలురైతులకు భూ యజమానులకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మేము గల్లీలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తాం తప్ప, ఢిల్లీలో ఉన్న అధిష్ఠానం మెప్పుల కోసం కాదని మండిపడ్డారు. మిషన్‌ కాకతీయ ద్వారా ఇప్పటికే 46 వేల చెరువులను బాగు చేసుకున్నామని, గోదావరి, కృష్ణ నదుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా 1200 టీఎంసీలను సంపూర్ణంగా వాడుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణలోని 1.25 లక్షల బీడు భూములకు నీళ్లు పారించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 4 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక 24 లక్షల టన్నుల గోదాములు నిర్మించామన్నారు. గతంలో వెయ్యి మంది వ్యవసాయ విస్తరణ అధికారులు ఉంటే ఇప్పుడు ప్రతి 5 వేల ఎకరాలకు ఒక్కరి చొప్పున 2631 మంది అధికారులను నియమించుకున్నామన్నారు. మొత్తానికి రైతులను రాజుగా చూడటానికే కేసీఆర్‌ ఇలాంగి పథకాలు అమలు చేస్తున్నారనని అన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్‌ సభలో అపశృతి
మంత్రి కేటీఆర్‌ సభలో అపశృతి చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రైతుబంధు చెక్కులను పంపిణీ చేస్తున్న సమయంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రైతు ఓగులాపూర్‌కి చెందిన ఇల్లందుల కిష్టయ్యగా గుర్తించారు. వెంటనే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఎల్లారెడ్డిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.