రైతుల గురించి ఆలోచించే ఏకైక నేత సిఎం కెసిఆర్‌

                                                                           దేశంలో ఎక్కడ కూడా పెట్టుబడి పథకం లేదు
                                                                             తెలంగాణలో సాగునీటికి భగీరథ యత్నం
                                                              రైతుబంధు కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌
రాజన్న సిరిసిల్ల,మే15(జ‌నం సాక్షి ): రైతుకు సాగునీళ్లు, త్రాగునీళ్లతో పాటు పెట్టుబడి సాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇలాంటి పథకం గతంలో ఎక్కడా ఎప్పుడూ లేదన్నారు. సిఎం కెసిఆర్‌ తరహాలో రైతుల గురించి ఆలోచించే నాయకుడు కూడా దేశంలో లేడన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం విలాసాగర్‌ గ్రామంలో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ..దేశంలో సరికొత్త హరిత విప్లవానికి తెలంగాణ ఆదర్శం కానుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు. ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని కేటీఆర్‌ పేర్కొన్నారు. బోయినపల్లి మండలంలోని చెరువులు, రోడ్ల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులు నింపేందుకు మిషన్‌ కాకతీయ ద్వారా కృషి చేస్తున్నామన్నారు. నాలుగేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రైతులను ఎవరూ పట్టించుకోలేదు. రైతాంగానికి 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. 2009లో కాంగ్రెస్‌ నాయకులు 9 గంటలని.. 6 గంటలని చెప్పి సరిగా కరెంటే ఇవ్వలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక కరెంటు, విత్తనాలు సరైన సమయానికి వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బిడ్డ కాబట్టి రైతుల కోసం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. 86 ఏళ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేసి 60 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్న నాయకుడు మన సీఎం అన్నారు. రూ. 200 పింఛను ఇచ్చేందుకు గత పాలకులు ఇవ్వడం కోసం ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రూ. వెయ్యి ఇస్తుందని చెప్పారు. రైతు బంధు ద్వారా కేసీఆర్‌ రైతులకు ఆత్మ బంధువుగా మారారన్నారు. రైతు బంధు కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ నేతలు విమర్శించడం సిగ్గు చేటన్నారు.