సిరిసిల్ల అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి

మంత్రి కెటిఆర్‌ మార్గదర్శకత్వంలో పట్టణాభివృద్ది

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి

సిరిసిల్ల,జనవరి28(జ‌నంసాక్షి): సిరిసిల్ల పట్టణాభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ మార్గదర్శనంలో అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి అన్నారు. నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎంతో నమ్మకంగా తనకు పదవీ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తోపాటు సహకరించిన టీఆర్‌ఎస్‌ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిపాలనకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి అవకాశం కల్పించిన టీఆర్‌ఎస్‌ శ్రేణులకు, సహకరించిన ప్రజలకు పార్టీ రాష్ట్ర నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు పూర్తిస్థాయిలో పురపాలక సంఘంలో మార్పు కోరుకున్నారని తెలిపారు. అధికారులతో ఉండి అభివృద్ధిని చేస్తామని, ఇచ్చిన మాటను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పదని అభివర్ణించారు. పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌ సారథ్యంలో విలీన గ్రామాలతో పాటు పట్టణాన్ని వచ్చే ఐదేళ్లలో అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు శ్రాయశక్తులా కృషిచేస్తామన్నారు. ప్రతిపక్షాలను మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని, అర్థం లేని ఆరోపణలు, అవినీతితో కూడిన ఎత్తుగడలు ఇక విూద పనికిరావని హితవుపలికారు.అపూర్వమైన తీర్పును అందించిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని స్పష్టంచేశారు. బల్దియాపై గులాబీ జెండా ఎగరడంతో గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. నూతనంగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు ప్రత్యేక వాహనంపై వార్డులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు పాలకవర్గానికి దండాలతో అభినందించారు. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా జిందం కళచక్రపాణి, వైస్‌ చైర్మన్‌గా మంచె శ్రీనివాస్‌, వేములవాడలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా రామతీర్థపు మాధవి, వైస్‌ చైర్మన్‌గా మధు రాజేంద్రశర్మ ఎన్నికయ్యారు. పార్టీ నాయకులు ముందే వీరిని గుర్తించి కెటిఆర్‌కు వివరించి అనుమతి పొందారు. రెండు మున్సిపాలిటీలలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎంపిక లాంఛనంగానే ముగిసినప్పటికీ వేములవాడలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ సిరిసిల్లలో వైస్‌ చైర్మన్‌ ఎంపికకు ఓటింగ్‌ జరగడంతో ఉత్కంఠగా మారింది. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులకు 22 మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, 12 మంది స్వతంత్రులు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచె శ్రీనివాస్‌కు ఓటు వేశారు. మంచె శ్రీనివాస్‌కు 34 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి బొల్గం నాగరాజుకు బీజే పీ చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఓటు వేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఓటింగ్‌కు దూర మున్నారు. దీంతో టీఆర్‌ ఎస్‌కు చెందిన మంచె శ్రీనివాస్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయినట్లు ప్రకటించారు. వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పేరును టీఆర్‌ఎస్‌ నాయకత్వం సీల్డు కవరులో పంపించడంతో మున్సిపల్‌ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందో అన్న అంశం చివరివరకు ఉత్క ంఠగా మారింది. 16వవార్డు కౌన్సిలర్‌ కొండ శ్రీలత, 9వవార్డు కౌన్సిలర్‌ రామతీర్థపు మాధ విలో ఒకరికి చైర్‌పర్సన్‌ స్థానం దక్కు తుందని తొలినుంచి ఊహాగానాలు వినిపించినా ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందోనని చివరి వరకు ఎదురుచూడాల్సి వచ్చింది.సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల పక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఇందుకు సహకరించిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌, కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.