రామానుజుల సంకల్ప బలం..సహస్రాబ్ది
హైదరాబాద్,ఫిబ్రవరి12(జనం సాక్షి):రామానుజుల బృహన్మూర్తిని, ఇక్కడి మహాహోమక్రతువు వైభవాన్ని చూసిన పారవశ్యంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి నోట వెలువడిన వాక్కు ఓ సత్యాన్ని
ఆవిష్కరించింది. సహస్రాబ్దిని జీయర్ స్వామివారే సంకల్పించినా ` సాక్షాత్తూ ఆ రామానుజులే కచ్చితంగా అనుకొనివుంటారు. భువినుంచి మన మధ్యకు దిగి రావాలని…! మనతోనే వుండాలని..! మనం చేస్తున్నాం కనుక ఇదింత గొప్పగా జరగడం లేదు… స్వయంగా ఆ భగవద్రామానుజులు రావాలనుకున్నారు కనుకే ఈ అద్భుతం ఇంత జగదానందకారకంగా సాగుతోందని సచ్చిదానంద స్వామి చెప్పింది అక్షరాలా నిజమని పిస్తోంది… ఆ యతిరాజే మన జీయర్ స్వామిలోకి ఆవాహితుడై, ఈ మహా సంరంభాన్ని స్వయంగా, ఇంత వైభవంగా జరిపిస్తున్నారేమో..! లేకుంటే 108 దివ్యదేశాలు ఒకచోట కొలువు తీరడమేమిటి? వాటిలో నిత్య కైంకర్య వ్యవస్థను పర్యవేక్షించేందుకా అన్నట్టు, వారే విరాట్రూపం ధరించి మధ్యలో విశాల భద్రవేదిపై ఆసీనులు కావడమేమిటి? ఎక్కడెక్కడిదేవదేవుళ్లనో ఒక్కచోటికి చేర్చినట్టు, ఎవరిదారిన వారు చీలికలై పోతున్న మనల్ని కూడా కలిపి, ఈ వసుధనే ఏక కుటుంబంగా మార్చేందు కేనేమో ఇంత వైభవంగా, మహోజ్వల దివ్యసుందర సువర్ణమూర్తిగా సాక్షాత్కరిస్తున్నారు ఆ జగదాచార్యులు…రామానుజాచార్యుల వారు.