సన్నాలు వేయమని మొహం చాటేస్తే ఎలా

సన్నవడ్లకు రూ.2500 ధర చెల్లించాల్సిందే: పొన్నం

కరీంనగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రైతులు సన్నవడ్లు వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్‌ వాటి కొనుగోలు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. ఆనాడు సన్నాలు వేయాలని చెప్పి ఇప్పుడు రైతులతో ఎందుకు దోబూచు లాడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు సన్నవడ్లకు మద్దతు ధర అడుగుతుంటే కేసీఆర్‌కు ఎందుకంత కోపం అని నిలదీశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఇద్దరూ తోడు దొంగలే అని విమర్శించారు. సన్నవడ్లకు రూ.2500 ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు రైతులకు ఉరితాడు వంటివని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ వ్యాపార సంస్థలను అంబానీ, ఆదానీలకు ఇచ్చినట్టుగా పంటలను వ్యాపార సంస్థలకు కట్టబెట్టేందుకు వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కేసీఆర్‌ నాటకాలు ఆడుతున్నాడని, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రా ల్లో వ్యవసాయ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం లేదని, కేసీఆర్‌ కూడా కేంద్ర చట్టాన్ని అమలు చేయవద్దని అన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టంలో మద్దతు ధర మాటే లేదని తెలిపారు. సన్నరకానికి క్వింటాల్‌కు 2,500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని, కేసీఆర్‌ మాట విని రైతులు సన్నరకం ధాన్యం సాగు చేసి నష్టపోయారన్నారు. వరదల్లో నష్టపోయిన రైరైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. సీసీఐ ద్వారా తడిసిన పత్తిని కొనుగోలు చేయాలని ఆయన కోరారు.