కేంద్రం బృందం పర్యటన

– వరద నష్టంపై అంచనా

హైదరాబాద్‌,అక్టోబరు 22(జనంసాక్షి):నగరంలోని పాతబస్తీ వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఫలక్‌నుమా, కందికల్‌, హఫీజ్‌బాబా నగర్‌ ప్రాంతాల్లో వరద నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. పాతబస్తీలోని తాజా పరిస్థితులను ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర బృందం వెంట జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా నగరంలో వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. రూ. 8,633 కోట్ల మేర పంటనష్టం జరిగినట్లు గుర్తించామని చెప్పారు. రహదారులకు రూ. 222 కోట్లు, జీహెచ్‌ఎంసీలో రూ. 567 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. చాంద్రాయణ గుట్ట ఫలక్‌నుమా వద్ద దెబ్బతిన్న ఆర్‌ఓబీ(రైల్వే ఓవర్‌ బ్రిడ్జి)ని, ముంపుకు గురైన ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధితులతో మాట్లాడిన కేంద్ర బృందం..ఆర్‌ఓబీకి రెండు వైపులా చేపట్టిన పునరుద్ధరణ, నాలా నుండి తొలగిస్తున్న పూడిక తీత పనులను పరిశీలించింది. భారీ వర్షాలు, వరదలతో మొదటి అంతస్తులోకి కూడా నీళ్లు వచ్చినట్లు ఆ ప్రాంత ప్రజలు కేంద్ర కమిటీకి వివరించారు. ఇప్పటికీ రోడ్లపై, ఇళ్లలోనూ వరద నీరు పేరుకుపోయి ఉన్నట్లు తెలిపారు. 10 రోజుల పాటు నీళ్లలో నానడం వల్ల తమ ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయని వాపోయారు. 40 సంవత్సరాల క్రితం ఫలక్‌నుమా ఆర్‌ఓబీని నిర్మించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ కేంద్ర బృందానికి వివరించారు. ఈ ఆర్‌ఓబీవలన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, చార్మినార్‌ ప్రాంతాలకు రోడ్డు సదుపాయం అనుసంధానం అయినట్లు తెలిపారు. అదేవిధంగా పల్లె చెరువు నుంచి వచ్చే వరద నీటి నాలా 7 విూటర్ల వెడల్పు ఉంటుందని, అది ఆర్‌ఓబీ కింద నుండి వెళ్తుందని తెలిపారు. పల్లెచెరువు తెగిపోవడం వలన వచ్చిన వరదతో ఈ ప్రాంతానికి అపార నష్టం జరిగినట్లు లోకేశ్‌ కుమార్‌ వివరించారు.