గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం
హైదరాబాద్,అక్టోబరు 2(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో సమావేశమయ్యారు. లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలపై ఇరువురు చర్చించారు. దసరా రోజు నుంచి ధరణి పోర్టల్, కొత్త రెవెన్యూ విధానం ప్రారంభం, వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు. ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాలు సహా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సీఎం వివరించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు సహా తాజా పరిణామాలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. రాజ్‌భవన్‌లో ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్న ఈ-ఆఫీస్ విధానం గురించి సీఎం కేసీఆర్‌కు గవర్నర్ వివరించినట్లు తెలిసింది.
గవర్నర్ భర్తకు సీఎం అభినందన
గవర్నర్ తమిళిసై భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సౌందరరాజన్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. సౌందరరాజన్‌కు ధన్వంతరి అవార్డు వచ్చిన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో సీఎం ఆయన్ను ఘనంగా సన్మానించారు.