తెలంగాణ వరద బాధితులకు తొలిసారి తెర హీరోల సాయం

– కేసీఆర్‌ పిలుపు మేరకు స్పందించిన టాలీవుడ్‌

– భారీగా విరాళాలు అందజేసిన చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌

హైదరాబాద్‌, అక్టోబరు 20(జనంసాక్షి):భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు విడుదల చేశారు. బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకు రావాలని కేసీఆర్‌ కోరగా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి చిరంజీవి కోటి రూపాయలు, మహేష్‌ బాబు రూ.కోటి రూపాయలు, నాగార్జున రూ. 50 లక్షలు, ఎన్టీఆర్‌ రూ. 50 లక్షలు, విజయ్‌ దేవరకొండ రూ.10 లక్షలు, హరీష్‌ శంకర్‌, అనీల్‌ రావిపూడి చెరో రూ. 5 లక్షలు విరాళం అందించేందుకు సిద్ధమయ్యారు.

చిరంజీవి రూ.కోటి రూపాయలు విరాళం

గడిచిన వందేళ్ళలో ఎప్పుడు లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వలన హైదరాబాద్‌ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత వాళ్ళు సాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అని చిరు తన ట్వీట్‌ లో పేర్కొన్నారు.

మహేష్‌ బాబు రూ.కోటి విరాళం

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్యులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ విపత్తు వల్ల సంభవించిన వినాశనం మనం ఊహించనిది. బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి తమ వంతు కృషి చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వారికి అభినందనలు. నా వంతు సాయంగా తెలంగాణ సీఎం సహయనిధికి కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మన ప్రజలకు అండగా వీలైనంత సహాయం అందించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను” అని మహేష్‌ బాబు అన్నారు.

నాగార్జున రూ.50 లక్షల విరాళం

భారీ వర్షాలు, వరదల వలన హైదరాబాద్‌ నగర ప్రజల జీవితం దుర్భరంగా మారింది. వారి బాగోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు విడుదల చేయడం హర్షణీయం. ఈ విపత్తు వలన నిరాశ్రయులైన వారికి నా వంతు సాయంగా రూ. 50 లక్షల రూపాయలని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నాను అని నాగార్జున పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ రూ.50 లక్షల విరాళం

ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ వరద బాధితులకి సాయంగా రూ. 50 లక్షల రూపాయలని విరాళంగా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. వర్షాలు , వరదలతో హైదరాబాద్‌ లో చాలా మంది జీవితాలు నాశనమయ్యాయి. మన నగర పునరావాసం కోసం తెలంగాణ సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు అందిస్తున్నాను. మనమందరం చేతనంత సాయం చేసి హైదరాబాద్‌ను పునర్నిర్మించుకుందాం అని ఎన్టీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

విజయ్‌ దేవరకొండ రూ.10 లక్షల విరాళం

గతంలో వరదలు వచ్చినప్పుడు కేరళ, చెన్నై ప్రజలకు సాయం చేశాం. ఆర్మీకు కూడా మనవంతు సాయం చేశాం. కరోనా సమయంలోను విరాళాలు అందించాం. ఇప్పుడు మన నగరాన్ని రక్షించుకోడానికి అందరం కలిసి ముందుకు సాగాలి. ఇందుకుగాను నా వంతు సాయంగా రూ. 10 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందించాను అని విజయ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

త్రివిక్రమ్‌, ఎస్‌.రాధాకృష్ణ రూ.10 లక్షల చొప్పున విరాళం

వరద బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌అధినేత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) చెరో రూ.10 లక్షలు ప్రకటించారు.

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వరద తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తమ వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌అధినేత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు). ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయక చర్యల కోసం తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌అధినేత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు ప్రభాస్‌ రూ.కోటి విరాళం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్‌ లో చాలా కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. కుండబోత వర్షాలతో నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు తమ వంతుగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ రంగాల ప్రముఖులను కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణలో వరద నష్టానికి సాయంగా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.

తెలంగాణ లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్‌ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తెలంగాణ సీఎం సహయనిధి కి తన వంతు సాయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

వరద బాధితులకు అండగా రామ్‌..రూ.25 లక్షలు విరాళం

యువ హీరో రామ్‌ పోతినేని సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళమిస్తున్నట్టు ప్రకటించి..గొప్ప మనసు చాటుకున్నాడు. నా తెలంగాణ ప్రజల పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నా. వరదలు వచ్చిన మొదటి రోజు నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించడం సంతోషకర విషయం. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సేవలు ప్రశంసనీయం. ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతుగా రూ.25 లక్షలు విరాళంగా అందజేస్తున్నానని రామ్‌ ట్వీట్‌ చేశాడు.