అక్కంపల్లి నుంచి పానగల్‌ ఉదయ సముద్రానికి నీటి విడుదల

తీరనున్న నల్లగొండ జిల్లా తాగునీటి కష్టాలు

నల్లగొండ,ఆగస్టు30 : నల్లగొండ అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పానగల్‌ ఉదయ సముద్రానికి తాగునీటిని అధికారులు విడుదల చేశారు. రోజుకు 400 క్యూసెక్కుల చొప్పున పది రోజులు నీటిని విడుదల చేయనున్నారు. ఇప్పడున్న పరిస్థితులను అనుగుణంగా 1.05 టిఎంసీల నీటిని పానగల్‌ ఉదయ సముద్రానికి చేర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయంతో నల్లగొండ పట్టణంతో పాటు 600 గ్రామాలకు సమృద్ధిగా త్రాగునీరు అందనున్నది. నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు నీళ్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ల దృష్టికి మంత్రి జగదీశ్‌ రెడ్డి తీసుకెళ్లారు. దీనిపై సీఎం కేసీఆర్‌ మంగళవారం జరిపిన సవిూక్షలో నీటి విడుదల చేయాలని ఆదేశించారు. డెడ్‌ స్టోరేజీలోనూ నీటి విడుదలకు ఆదేశించిన సీఎం కేసీఆర్‌ కు మంత్రి జగదీశ్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.