అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయండి

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి,నవంబర్‌17(జ‌నంసాక్షి): : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, నాలుగున్నరేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాన్‌గల్‌ మండలంలోని శాగాపూర్‌ తండా, దావత్కాన్‌పల్లి, మాధవరావుపల్లి, కొత్తపేట గ్రామాల్లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమాలకు మంత్రి

జూపల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 60 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణ ప్రయోజనాలను, ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రాన్ని సాధించుకున్న నాలుగున్నరేళ్లకే ఉమ్మడి జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు. జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టులను ఆపాలని కేంద్రానికి 30 లేఖలు రాసిన చంద్రబాబుకు ఇక్కడి ప్రాంత ప్రజలను ఓట్లడిగే హక్కేలేదని తెలిపారు. తెలంగాణను ఆగమాగం చేసేందుకు ఆంధ్రా పార్టీలన్నీ ఒక్కటయ్యాయన్నారు. మహాకూటమిని నమ్మి అధికారమిస్తే పరిపాలన అంతా అమరావతి, ఢిల్లీల నుంచే సాగుతుందన్నారు.

తెరాస రెబల్‌ అభ్యర్థి ప్రచారం

మహబూబ్‌నగర్‌ జిల్లా అమరచింత మండల కేంద్రంలో తెరాస రెబల్‌, స్వతంత్ర అభ్యర్థి ఎం.జలంధర్‌ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి పద్మజారెడ్డి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప, వెంకటేశ్వరస్వామి ఆలయాలలో పూజలు చేసి, రాజావళి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వ్యాపారులను, దుకాణదారులను, కార్మికులను ఆమె కలిశారు. ఈ ప్రాంత ప్రజలు అందరికీ అవకాశం ఇచ్చారని ప్రజలకు అందుబాటులో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచి వెంకటేశ్వరరెడ్డి, తెరాస అసమ్మతి నాయకులు, చరణ్‌ గౌడ్‌, గంగాధర గౌడ్‌, రవి, రఘురాం, నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.