కాంగ్రెస్‌,బిజెపిలకు ఓటేస్తే లాభం లేదు

టిఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ది
నాగర్‌ కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రాములు
నాగర్‌కర్నూలు,మార్చి26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేస్తే మిగిలేది శూన్యమేనని నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు అన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉదయం నుంచే ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు కెసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రమ్మరథం పడుతున్నారని అన్నారు. వార్‌ వన్‌సైడ్‌గా మారిందని అన్నారు. తెలంగాణను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌ సేవలు దేశానికి ఎంతో అవసరమని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సర్కార్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశం యావత్తు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబీమా, రైతుబంధు వంటి అనేక పథకాలు దేశానికి అందాలంటే సీఎం కేసీఆర్‌ కేంద్రంలో కీలకపాత్ర పోషించాలన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి నా బాధ్యత నెరువేరస్తానని రాములు అన్నారు. ప్రతి కార్యకర్తను సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటానని, తన కులం టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కులమని ఎంపీ అభ్యర్థి రాములు అన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది గొప్పగొప్ప నాయకుల పరిచయాలు పొందానని, దీంతో ఎంపీగా గెలిచిన అనంతరం పాలమూరు అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తానన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న గద్వాల-మాచర్ల రైల్వే లైన్‌ను ఐదేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతానన్నారు. గద్వాల, అలంపూర్‌ ప్రాంతాలకు రావల్సిన నీటి పారుదల ప్రాజెక్టులు తర్వతగతిన పూర్తయ్యేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఎంపీగా ఎంత మెజార్టీతో గెలిపిస్తే అంత శక్తివంతంగా పనిచేస్తానని హావిూ ఇచ్చారు. 15 టీఎంసీల కెపాసిటీతో కృష్ణా, తుంగభద్ర నదులు కలిసే చోటు వరకు సాగునీరు అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన నమూనా చిత్రా లు కూడా తయారు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయిందన్నారు. 16 ఎంపీ స్థానాలను గెలిపించుకుంటే కేంద్రంలో సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన ఫెడరల్‌ ప్రంట్‌ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త యుద్ద సైనికుల్లా పని చేయాల్సిన అవసరముందన్నారు.