కాళేశ్వరంపై మంత్రి హరీశ్ కీలక సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టు మూడు పంప్ హౌజ్ ల నిర్మాణం 2018 మార్చి చివరికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. 2018 జూన్ కల్లా మొత్తం పనులు పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్ లోని జలసౌధలో ఈ ప్రాజెక్టు పనులపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. వివిధ దేశాలకు చెందిన పుంపులు, మోటార్లు, ఇతర ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్ మెంట్ ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులతో మంత్రి  సమీక్షించారు. ఇండియాతో పాటు ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, చైనా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీ తదితర దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకున్న మేఘ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని మేఘ సంస్థను ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సాగునీటి కోసమే కాదని, ప్రథమ ప్రాధాన్యత కింద హైదారాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను కూడా తీర్చనుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మిషన్ భగీరధ పథకాన్ని అనుసంధానం చేసి 2017 డిసెంబర్ కల్లా తాగునీటి సరఫరా చేయనున్నట్టు చెప్పారు. కనుక కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌజ్ లు, బ్యారేజీలను షెడ్యూలు ప్రకారం పూర్తి చేయడం కూడా తెలంగాణకు అత్యంత ముఖ్యమని హరీశ్ రావు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఒక సవాలుగా తీసుకొని షెడ్యూలు ప్రకారం పూర్తి చేసేందుకు గాను పంపులు, మోటార్లు ఇతర సాంకేతిక పరికరాలను, యంత్రాలను వీలైనంత త్వరగా సమకూర్చుకోవాలని ఎంఇఐఎల్ సంస్థను కోరారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్ హౌజ్ లకు సంబంధించిన సివిల్ పనులన్నీ వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. యంత్ర పరికరాలన్నీ సకాలంలో సరఫరా చేయాలని ఆయా దేశాల తయారీదార్లను మంత్రి కోరారు. వీలైనంత త్వరగా పంపులు, మోటార్లు సరఫరా చేయడంతో పాటు వాటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరాదని ఆయన స్పష్టం చేశారు. చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి ఆసియాలోనే రికార్డు నెలకొల్పాలని మంత్రి సంబంధిత ఏజన్సీలను కోరారు. 2018 జూన్ కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఖరీఫ్ సీజన్లో గోదావరి జలాలు తెలంగాణ పొలాలకు తరలించాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత కీలకమో, తెలంగాణకు ఇది జీవనాడిగా ఎలా మారనున్నదో మంత్రి హరీశ్ రావు వివరించారు. ఈ ప్రాజెక్ట్ పంపుహౌజ్ ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణీత కాలవ్యవధిని ఇదివరకే ఖరారు చేశారు. వాటికి అనుగుణంగా చేపట్టవలసిన పనులపై కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని ఆదేశించారు. సివిల్ పనులను పూర్తి చేయడం, మూడు పంపింగ్ స్టేషన్లలోనూ పంపులు, మోటార్ల సరఫరా, వాటి  బిగింపు షెడ్యూలు, మోటార్ల టెస్టింగ్, విద్యుత్ ట్రాన్స్ మిషన్ లైన్ల ఏర్పాటు, సబ్ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ ట్రాన్స్ మిషన్ల ప్రస్తుత పరిస్థితిపై మంత్రి హరీశ్ రావు సమీక్షించారు.

డ్రై రన్ చేపట్టడానికి మొదటి పంపు ఏర్పాటు షెడ్యూలుతో పాటు ఇతర పంపుల నిర్మాణానికి సంబంధించిన షెడ్యూలును కూడా ఈ రోజే ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఖరారు చేయాలని మేఘ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. మొత్తం మూడు పంపింగ్ స్టేషన్లను వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేయవలసిన బాధ్యత ఎంఇఐఎల్ వారిదేనని అన్నారు.

ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు తో పాటు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషి, ఇ.ఎన్.సి. మురళీధరరావు, కాళేశ్వరం సి.ఇ. ఎన్.వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, సి.ఇ. సి.డి.ఓ నరేందర్ రెడ్డి, మంత్రి ఓ.ఎస్.డి. దేశ్ పాండే పంపుల తయారీ కంపెనీలు యాన్ డ్రిచ్( ఆస్ట్రియా ), జైలమ్ వాటర్ సొల్యూషన్స్ ( అమెరికా ), మోటార్ల తయారీదారులు ఎ.బి.బి ఇండియా లిమిటెడ్ (ఫిన్లాండ్, స్విట్జర్లాండ్), డబ్ల్యూ.ఇ.జి. ఇందస్రీస్ (బ్రెజిల్), వాల్వ్స్ తయారీదారులు సెవర్న్ గ్లూకోన్ (చైనా), హూబీ  హాంగ్ చెంగ్ (చైనా) పాల్గొన్నారు.