కొత్త పంచాయతీల్లో అందుబాటులో లేని రేషన్‌ దుకాణాలు

ప్రభుత్వం హావిూ ఇచ్చిన సాకారం కాని షాపులు
ఆసిఫాబాద్‌, నవంబరు9 (జనం సాక్షి): కొత్తగా పంచాయతీలుగా ఏర్పాటు చేసిన గూడాలు, తండాలలో చౌక ధరల దుకాణాల ఏర్పాటు అంశం నేటికీ కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలలో చౌకధరల దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి 14 నెలలు గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు కదలిక లేదు. దాంతో ఏజెన్సీవాసులు పాత పంచాయతీలకు వెళ్లి రేషన్‌ సరుకులు తెచ్చుకోక తప్పని పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాల ప్రజలు కొన్ని చోట్ల పది నుంచి పదిహేను కిలోవిూటర్ల దూరం ప్రయాణిస్తే తప్ప నిత్యావసర సరుకులు పొందలేని పరిస్థితి కొనసాగుతోంది. ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 1,25,412 రేషన్‌ కార్డులు ఉండగా 278 చౌకధరల దుకాణాల ద్వారా ప్రతి రేషన్‌ కార్డు విూద మనిషికి ఆరు కిలోల చొప్పున 298 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే గతంలో మ్యానవల్‌ పద్ధతిలో రేషన్‌ సరుకులు ఇచ్చినప్పుడు ఒకరిద్దరు వ్యక్తులు ఇరుగుపొరుగు వారి రేషన్‌ సరుకులు కూడా తీసుకు వెళ్లే పరిస్థితులు ఉండేది. ఈ-పాస్‌ విధానం అమలులోకి తెచ్చిన తరువాత రేషన్‌ సరుకులను తప్పనిసరిగా లబ్దిదారులే తీసుకోవాలి. దీంతో పనులన్నీ మానుకుని పాత పంచాయతీలకు వచ్చి రేషన్‌ సరుకులు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని లబ్దిదారులు వాపోతున్నారు.గతంలో ఉన్న 173 పంచా యతీల పరిధిలో దాదాపు 1,033 రెవెన్యూ గ్రామాలు ఉండేవి. అప్పట్లోనే పాత పంచాయతీలకు వచ్చి రేషన్‌ సరుకులు తీసుకు వెళ్లేందుకు ప్రజలకు మూడు నుంచి నాలుగు మైళ్ల ప్రయాణం చేస్తే తప్ప సరుకులు అందని పరిస్థితి. అయితే గతేడాది ఆగస్టు 3వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలలో రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వ నిర్ణయం అమలు కాకపోవడంతో రేషన్‌ సరుకుల కోసం పాత పంచాయతీ కేంద్రాలే నేటికీ దిక్కుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కెరమెరి, జైనూరు, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, తిర్యాణి, వాంకిడి వంటి మండలాల్లో రేషన్‌ షాపులకు, కొత్త పంచాయతీలకు మధ్య పదేసి కిలో విూటర్ల దూరం ఉంటోందని ఇలాంటి గ్రామాల్లో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. మరీ ముఖ్యంగా వర్షాకాలం సీజన్‌లో చిన్న వాగులు, వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాగులు దాటి ప్రాణాలను పనంగా పెట్టి రేషన్‌ సరుకులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏజెన్సీ గ్రామాల్లో కొనసాగుతోంది. మెజార్టీ గ్రామాలు అటవీ ప్రాంతంలో ఉండడంతో కొన్ని సందర్భాల్లో కాలినకడన కూడా వెళ్లే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రేషన్‌ సరుకుల పంపిణీ దుకాణాలకు, కొత్త పంచాయతీల లబ్దిదారుల మధ్య ఉత్పన్నమవుతున్న సమస్యలపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న స్పెషల్‌
ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు మూడు కిలోవిూటర్ల దూరం కాలినడకన రాక పోకలు నిర్వహిస్తూ నిత్యావసర సరకుల్ని తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా మరికొన్ని గ్రామ పంచాయతీల లబ్దిదా రులు నిత్యావసర సరకుల కోసం ఆటోలో రాకపోకలు నిర్వహిస్తూ రూ.15 అదనంగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నూతన షాపులను ఏర్పాటు చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు.