గద్దర్‌ రాకతో ధర్మపురిలో ఉత్తేజం

ఆటపాటలతో కూటమికి మద్దతుగా ప్రచారం
తెలంగాణను కెసిఆర్‌ నుంచి విముక్తం చేయాలని పిలుపు
ధర్మపురి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): గద్దర్‌ రాకతో ధర్మపురిలో జోష్‌ నిండింది. కూటమి అభ్యర్తి అడ్లూరి లక్షమణ్‌ కుమార్‌కు మద్దతుగా ఆయన ధర్మపురిలో శుక్రవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. పాటలు పాడుతూ మధ్యమధ్యలో చెణుకులు విసరుతూ ఆయన చేసిన ప్రంగం ఆద్యంతం ఆకట్టుకుంది. దగాపడ్డ తెలంగాను కెసిఆర్‌ మరింత దగా చేశారని విమర్శించారు. కొట్టాడి సాధించుకున్న తెలంగాణ కెసిఆర్‌ కుటుంబ కబంధమస్తాల నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు.  రూ.300 కోట్లతో ప్రగతిభవన్‌ను నిర్మించుకున్న కేసీఆర్‌కు పూరి గుడిసెల్లో మగ్గుతున్న పేదలకు రెండు పడక గదుల ఇళ్ల విషయం విస్మరించారన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో తల్లుల ఘొషలే మిగిలాయన్నారు. అయిదేళ్లలో రాష్ట్రం అన్నింటా దోపిడీకి గురైందన్నారు. బాసర నుంచి ధర్మపురి, కాళేశ్వరం వరకు ప్రవహించే గంగమ్మ, లక్ష్మీనరసన్న సన్నిధిలో కంట తడి పెడుతోందన్నారు. మురుగు కాలువలతో కలుషితమైన గంగమ్మ ఘోషను కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. అనేక హావిూలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం వాటన్నింటినీ తుంగలో తొక్కిందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి కలగానే మిగిలిందన్నారు. భూస్వాములు, పెత్తందారులకే మేలు చేసే రైతుబంధు పథకం కౌలు రైతుల కష్టాలు తీర్చడం లేదని, అన్నదాత అప్పుల పాలయ్యారన్నారు. బతుకులు బాగుపడాలంటే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గ్దదె దించాల్సిందేనని గద్దర్‌ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా తన పాటలు, మాటలతో సభికులను అలరించారు. లంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 300 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇంటింటికీ ఉద్యోగమంటూ కబుర్లు చెప్పిన ప్రభుత్వం యువకులను జైళ్ల పాలు చేసిందన్నారు. ఓట్ల విప్లవం రాబోతుందని, యువకులు, మహిళలు, మేధావులు, కళాకారులతో పాటు అన్ని పార్టీలతో ఏర్పడ్డ మహాకూటమిని అధికారంలోకి తేవాలన్నారు. ధర్మపురిలో లక్ష్మణ్‌కుమార్‌ను గెలిపించాలని అన్నారు. మహాకూటమి అధికారంలోకి రాబోతోందని, కలగానే మిగిలిన పథకాలు పేదల దరి చేరుతాయన్నారు. రాత్రి వరకు గద్దర్‌ పాటలతో, ఆటలతో సభికులను రంజింపజేశారు. ప్రభుత్వంపై విమర్శలను గద్దర్‌ పాటల రూపంలో వినిపించగా, ‘పొడుస్తున్న పొద్దు విూద పోరు తెలంగాణ’ అనే పాటతో ముగించారు.